కరీంనగర్ రూరల్, మే 12 : కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. రెండున్నరేళ్లుగా సీజన్ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించినా ఇప్పుడా అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వరి కోసి నెల రోజులు దాటినా.. మ్యాశ్చర్ వచ్చినా.. కొనే నాథుడు లేక ఆగమవుతున్నారు. పొద్దంతా వడ్లను నేర్పుతూ.. రాత్రయితే మళ్లీ కుప్పులుగా పోస్తున్నారు. ఏ మాత్రం మబ్బులు కమ్మినా భయంతో వణికిపోతున్నారు. రోజులు గడుస్తున్నా కొనకపోవడంతో వడ్ల కుప్పలపైనే పరదాలు వేసుకుని పడిగాపులు గాస్తున్నారు. అక్కడక్కడా కొంటున్నా.. తూకంలో మోసాలతో నష్టపోతున్నారు. 40 కేజీల బస్తాకు 43 కేజీలు తూకం వేసేందుకు ఒప్పుకొంటేనే గన్నీ బ్యాగులు ఇస్తున్నారని, వాటికే కాంటా వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. క్వింటాల్‌కు ఏకంగా 7.5 కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తే అందినకాడికి తమను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మంగళవారం కోరుట్లతోపాటు చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల దోపిడీ భగ్గుమన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించారు. నాణ్యమైన వడ్లను ఏ కేటగిరీలో కాకుండా బీ కేటగిరీలో కొనుగోలు చేస్తూ క్వింటాల్‌కు రూ.20 తకువ చెల్లిస్తున్నా పట్టించుకునే వారు లేరని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనుగోళ్లు సాఫీగా జరిగాయని, పదేళ్లలో ఏనాడూ తాము ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతున్నామని ఆవేదన చెందారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ఇరువై, నెల రోజులు గడుస్తున్నా కొనేవారు దిక్కులేరని మండిపడ్డారు. రైతులను గోస పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవుపలికారు. మరో ఇరువై రోజుల్లో వానకాలం రాబోతున్నదని, ఇప్పటికే అకాల వర్షాలు వెంటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలోపే కొనుగోళ్లు వేగవంతం చేసి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చొప్పదండి, మే 12 : ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని చొప్పదండి మండలం రుక్మాపూర్ రైతులు ఆగ్రహించారు. మంగళవారం సుమారు 200 మందికిపైగా తరలివచ్చి, గ్రామం మీదుగా వెళ్లే రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. దాదాపు గంట సేపు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మిల్లర్లు 43 కేజీలు తూకం వేస్తేనే ధాన్యం తీసుకుంటామని, లేదంటే తీసుకోమని తెగేసి చెబుతున్నారని ఆవేదన చెందారు. ఆ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, తరుగు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ నవీన్‌కుమార్, ఎస్ఐ నరేశ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
శంకరపట్నం, మే 12: ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యంపై శంకరపట్నం బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. కోతలు పూర్తవుతున్నా పట్టించుకోవడం లేదని కన్నెర్ర జేశారు. ఈ మేరకు మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ, సింగిల్ విండో చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి, మాజీ జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు రైతులను నిండా ముంచుతున్నదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. మిల్లర్లు ఏ గ్రేడ్ రకం ధాన్యాన్ని కూడా కామన్ రకం కింద జమ కడుతున్నారని, దీని వల్ల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మిల్లర్లు, కింది స్థాయి అధికారులు కుమ్మక్కై ఒక్కో క్వింటాల్‌కు 6 నుంచి 10 కిలోల తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి వారాలు గడుస్తున్నా కాంటా వేయకుండా జాప్యం చేస్తున్నారన్నారు. సర్కారు వెంటనే స్పందించాలని, లేకుంటే రైతుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. పోలీసులు అక్కడికి చేరుకొని, ఆందోళనను విరమింపజేశారు. అనంతరం నాయకులు తహసీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గుర్రాల తిరుపతిరెడ్డి, సర్పంచులు నెలవేని మహేశ్, విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్లూరి పోచయ్య, మాడ రాజిరెడ్డి, మోరె శ్రీనివాస్, గోపు విజయ్‌కుమార్‌రెడ్డి, వావిలాల రాజు, అంతం తిరుపతిరెడ్డి, గుర్రం శ్రీకాంత్, పార్థసారథి, అంతం కృష్ణారెడ్డి, మొకిరాల కిషన్‌రావు, మేకల కుమార్, గూళ్ల రమేశ్, తిరుపతి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో కొనుగోళ్లు వేగవంతం కాకపోవడంతో ధాన్యం కుప్పులు పేరుకుపోయాయి. కొనేవారు లేక రైతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఎండ వచ్చినప్పుడు ఇలా నేర్పుతున్నారు. ఏ మాత్రం మబ్బు పడినా వెంటనే కుప్ప చేస్తూ టార్పాలిన్లు కప్పుతున్నారు.
కోరుట్ల, మే 12 : ధాన్యం తూకంలో మోసాలను నివారించాలని, రైస్ మిల్లర్ల దోపిడీ అరికట్టాలని కోరుట్ల మండలంలోని రామారావుపల్లె, పెద్దాపూర్ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సుమారు 200 మందికిపైగా కోరుట్లకు తరలివచ్చి, రాస్తారోకో చేశారు. పెద్దగుండు సమీపంలో 63వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. గంటపాటు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రెండు నెలల క్రితం ధాన్యం తెచ్చినా కొనుగోళ్లు చేయడం లేదని మండిపడ్డారు. మిల్లర్లు తాలు పేరిట క్వింటాల్‌కు 7.5 కిలోల చొప్పున కోత విధిస్తున్నారని మండిపడ్డారు.

కొనుగోళ్లలో జాప్యం వల్ల అకాల వర్షాలతో కంటి మీదు కునుకు లేకుండా భయంతో బతుకుతున్నామని వాపోయారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని ప్రజావాణిలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేవని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని ఆరోపించారు. తమ సమస్యలు పరిషరించే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో రావాలని నినాదాలు చేశారు. కోరుట్ల – నిజామాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. మెట్పల్లి తహసీల్దార్ నీతా కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.