యూరియా కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు పడిగాపులు తప్పలేదు. శనివారం యూరియా రావడంతో రాఖీ పండుగను సైతం లెక్కచేయకుండా సొసైటీల వద్దకు పరుగులు పెట్టారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. కొన్నిచోట్ల చెప్పులను క్యూలైన్లలో పెట్టారు. పొద్దంతా పడిగాపులు కాశారు. పోలీసుల పహారాలో ఒక్కొక్కరికి రెండు బస్తాల మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వీణవంక/సైదాపూర్/మల్లాపూర్/చిగురుమామిడి, ఆగస్టు 9 : సర్కారు నిర్లక్ష్యం, అవగాహన లేమితో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు యూరియా కోసం నిత్యం అవస్థలు పడుతున్నారు. పీఏసీఎస్‌ల వద్ద బారులు తీరుతున్నారు. వీణవంక మండలం నర్సింగాపూర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు 230బస్తాలతో యూరియా లోడ్ లారీ వచ్చింది. ఒక్కొక్కరికి ఆధార్‌కార్డుపై రెండు బస్తాలు మాత్రమే ఇవ్వగా, ఇంకా 215మంది రైతులకు యూరియా అందలేదు. అలాగే సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి-సైదాపూర్ సహకార సంఘానికి 230బస్తాల యూరియా రావడంతో రైతులు సొసైటీ వద్దకు చేరుకుని చెప్పులతో క్యూ కట్టారు. తర్వాత పోలీసుల పహారాలో రైతులకు రెండు బస్తాలు అందించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఉదయం నుంచి రైతులు యూరియా కోసం క్యూలో వేచిఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని మల్లాపూర్ సహకార సంఘానికి 340బస్తాలతో యూరియా లోడ్ వచ్చింది. దీంతో యూరియా కోసం వచ్చిన రైతులతో కార్యాలయం ఆవరణ కిక్కిరిసిపోయింది. చివరికి పట్టా పాస్‌బుక్ ఆధారంగా రైతులకు ఒక్కొక్కరికి నాలుగు బస్తాల వరకు అందజేశారు. సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమందికి మాత్రమే యూరియా దొరకగా, మిగతా రైతులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెన్ని రోజులు సొసైటీల చుట్టూ తిరగాలంటూ మండిపడ్డారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేశారు.
నాకు మూడుకరాల పొలం ఉన్నది. యూరియా కావాలని ఐదు రోజులుగా సొసైటీ గోదాం వద్దకు వస్తున్న. వచ్చే సరికే బస్తాలు అయిపోయినయని ఎల్లగొడ్తన్రు. ప్రతి లోడ్‌కు కనీసం 20 నుంచి 30 బస్తాలు మాయమయితన్నయి. ఎక్కడికి పోతన్నయంటే హమాలీలు తీసుకుంటర్రని వాళ్ల పేరు చెబుతున్నరు. సోమవారం యూరియా బస్తాల లోడ్ వస్తదని ఆ రోజు ఇస్తమని మా పేర్లు రాసుకున్నరు. ఆ రోజు గూడ రాకుంటే జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి ఫిర్యాదు చేస్తం. మండలంల ఎక్కడ గూడ యూరియా దొరుకుతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సరిపోయేన్ని బస్తాలు పంపియ్యాలె.
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి. మండల వ్యవసాయాధికారి యూరియా కొరత లేదని చెబుతున్నది. కానీ ఈ రోజు సొసైటీ వద్ద చాలా మంది రైతులకు యూరియానే దొరకలేదు. రైతులు ఉదయం నుంచి ఎదురుచూసినా వారికి నిరాశే ఎదురవుతున్నది.