మండుటెండల్లో నిండుకుండలను తలపించి.. మత్తళ్లు సైతం దుంకి ఆదరువుగా నిలిచిన చెరువులు నేడు వట్టిపోతున్నాయి. ఏడాదిన్నర కిందటి వరకు పల్లెలకు జీవం పోసినా ప్రస్తుతం ఎడారులను తలపిస్తున్నాయి. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్లో అడుగంటిన చెరువులు, కుంటలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏడాదిన్నర కిందటి వరకు గ్రామంలో వందల ఎకరాలకు నీరందించిన ఈ కుంటలు, ఇప్పుడు చుక్కనీరివ్వలేని దుస్థితికి చేరాయి. మరోవైపు భూగర్భ జలాలు ఊహించని విధంగా పడిపోతుండగా, పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బోర్లు, బావుల్లో నీటి మట్టం పడిపోయి పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుండగా, దాదాపు 68 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. చెరువులు, కుంటల కింద రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, మార్చి 18 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం మొగ్దుంపూర్లో ఏడాదిన్నర కిందటి వరకు మంచి పంటలు పండాయి. ఏ యేడాది వానకాలం కూడా బాగానే చేతికొచ్చాయి. ఈ యాసంగిలో కూడా నీళ్లుంటాయనే ఆశతో వేసిన పంటలపై తీవ్ర ప్రభావం పడింది. పదేళ్లలో ఎన్నడూ చూడని దుర్భిక్ష పరిస్థితులు గ్రామంలో అలుముకుకోగా, రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. బతుకమ్మ చెరువు గతేడాది యాసంగి పంటకు నీళ్లందించింది. ఇరుకుల్ల వాగు పక్కనే ఉన్న ఈ చెరువు కింద సుమారు 200 ఎకరాల ఆయకట్టు ఉన్నది. యాసంగి నీళ్లు వస్తయో లేదోనని కొందరు రైతులు సాగు భూమిని బీడుగా వదిలేస్తే.. పంటలు వేసిన రైతులు నీటి కోసం పడరాని తిప్పలు పడుతున్నారు. బోర్లు, బావులు అడుగంటిపోగా, పంటలను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నారు. ఇప్పటికే అనేక మంది పొలాలు ఎండిపోయాయి. చాలా మంది పంటలు చేతికి రాకుండా పోతున్నాయి.
గ్రామంలోని గరిమిల్ల చెరువు నెల క్రితమే చుక్కనీరు లేకుండా ఎండిపోయింది. 150 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. బావుల్లో ఉన్న నీళ్లతో పొలాలను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంగా తడారి పోతున్నాయి. బావు, బోర్లు చూస్తే అడుగంటుతున్నాయి. మరో నెల రోజులు సాగునీరు అందిస్తే తప్ప పంటలు చేతికి వచ్చే పరిస్థితులు లేవు. పొలాలు ఎట్లా పారించేదని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గాండ్లకుంట కింద 60 ఎకరాలు, కుమ్మరిగిద్దెకుంట కింద 30 ఎకరాలు, అవుసుల కుంట కింద 50 ఎకరాల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. బావులు, బోర్లలో నీళ్లతోనే పొలాలు పారించే ప్రయత్నం చేస్తున్నారు. ఎండిన మడులు తడిపే ప్రయత్నం చేయడం లేదు. ఉన్న పంటను కాపాడుకోవాలనే ప్రయత్నంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక్క కొమ్మికుంట పరిధిలో కొన్ని నీళ్లు ఉన్నాయని, దీని కింద 100 ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ ఉన్న నీళ్లు కొద్ది రోజులు కూడా సరిపోయే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మరి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
ఎడాదిలో ఎంత లోతుకో..
రాష్ట్ర ప్రభుత్వం నీటిపై సరైన ప్రణాళికను సిద్ధం చేయకపోవడంతో కాలువల ద్వారా చెరువులు, కుంటల్లోకి నీళ్లు వదల లేదు. ఏడు రోజుల వ్యవధిలో సాగునీటిని నేరుగా పొలాలకు వదలడంతో భూగర్భ జలాల స్థిరీకరణ పడిపోయింది. గతేడాదికి ఇప్పటికి పోలిస్తే కొన్ని మండలాల్లో మీటరు కంటే ఎక్కువ లోతుకు పడిపోయాయి. చిగురుమామిడి మండలంలో గతేడాది ఫిబ్రవరిలో 9.96 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు ఈ యేడాది అదే నెలలో 10.02 మీటర్లకు పడిపోయాయి. ఎస్సారెస్పీ ఆయకట్టు ఉన్న చొప్పదండి మండలంలో గతేడాది 9.41 మీటర్లలోనే ఉన్న భూగర్భ జలం, ఇప్పుడు 11.65కు పడిపోయి ప్రమాదఘంటికలు మోగిస్తున్నది.
మరో ఆయకట్టు ప్రాంతం ఇల్లందకుంటలో 4.32 మీటర్ల నుంచి 6.35 మీటర్లకు పడిపోయింది. కొత్తపల్లి మండలంలో అయితే మరింత ప్రమాదకరంగా ఉన్నది. గతేడాది 6.93 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు ఇపుడు 10.65 మీటర్లకు పడిపోయాయంటే ఎంత ప్రమాదకంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. హుజూరాబాద్, తిమ్మాపూర్, సైదాపూర్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఫిబ్రవరి నివేదిక ప్రకారం చూస్తే శంకరపట్నం, వీణవంక, గన్నేరువరం మండలాల్లో కొంత వరకు భూగర్భ జలాలు స్థిరంగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో మరింత పడిపోయే ప్రమాదమున్నది. అయితే ఆయకట్టు మండలాలకు నీటి సరఫరా నిలిపి వేసిన తర్వాత నీటి కష్టాలు విపరీతంగా ఉండే ముప్పు ఉన్నది.
Karimanagr5
ప్రశ్నార్థకంగా 68వేల ఎకరాలు!
కేసీఆర్ ప్రభుత్వంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలకు అనుసంధానమైన ప్రతి చెరువు, కుంటను నింపి భూగర్భ జలాలు వృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కరీంనగర్ జిల్లాలో మొగ్దుంపూర్తోపాటు అనేక గ్రామాల రైతులు చెరువులు, కుంటలపై ఆధారపడి వ్యవసాయం చేసుకున్నారు. కానీ, ఈ సారి మాత్రం నేరుగా పంటలకు మాత్రమే నీళ్లు వదులుతున్నారు. ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని ఇస్తున్నారు. ఆన్ పీరియడ్లో ఎనిమిది రోజులపాటు నీళ్లిస్తున్నారు. నీళ్లు తక్కువగా వదలడంతో పైనున్న ఆయకట్టుకే సరిపోవడం లేదు. దీంతో చివరి ఆయకట్టులో ఉన్న మొగ్దుంపూర్లాంటి అనేక గ్రామాల రైతులు సాగునీటి కోసం కష్టాలు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 1,376 చెరువులు, కుంటలు ఉన్నాయి.
అందులో 100 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న చెరువులు 137 ఉండగా, వంద ఎకరాలలోపు ఉన్నవి 1,239 చెరువులు ఉన్నాయి. కాలువల ద్వారా నీళ్లు వదలడంతో గత బీఆర్ఎస్ పాలనలో ఈ చెరువులు, కుంటలు నిండు వేసవిలో కూడా మత్తళ్లు పడ్డాయి. వాగులు, ఒర్రెల ద్వారా నీటి దారలు పారడంతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. బావులు, బోర్లలో నీళ్లు పైపైకి చేరాయి. ఏడాదిలో రెండు పంటలకు సాగునీటి లోటు లేకుండా ఉండేది. పుష్కలమైన పంటలు పండించి రైతులు ఎంతో సంతోషంగా కనిపించేది. ఇపుడా పరిస్థితి లేకపోవడంతో అనేక గ్రామాల్లో చెరువులు ఎడారుల్లా మారాయి. వాటిపైనే ఆధారపడి సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయి. దాదాపు 68ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. కన్నీళ్లు దిగమింగుతున్న రైతులు తమ పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి కనిపిస్తున్నది.
పదేండ్ల సంది కరువే లేకుండె
మా ఊరికి పదేండ్ల సంది నీళ్లకు సావు లేకుండే. చెరువులు కుంటలు ఇట్ల తెర్లయితయని అనుకోలే. ఏడెనిమిది చెర్లు, కుంటల్ల నిట్టెండ కాలం సుతం నీళ్లు పుష్కలంగా ఉండే. నీటికి కరువు లేకుంట పంటలు పండినయి. రైతులకు ఎసొంటి రంది లేకుండ రొండు పంటలు పండిచ్చుకున్నరు. మా చెరువులకు కాలువలతోని నీళ్లిడిచేది. ఎల్లమ్మ గుడికాంచి వాగుల చిన్న దారవోయినా బావుల్ల నీళ్లుండేటియి. ఇపుడు అటు వాగు ఎండిపోయింది. ఇటు చెరువులెండి పోయినయి. నీళ్లకు కరువచ్చింది. పంటలు చేతికస్తయన్న నమ్మకం పోతున్నది. చెరువుల్ల నీళ్లుంటయని వాన కాలంల 32 వేలు పెట్టి చాప పిల్లలు పోసుకున్నం. ఒక్క చాప పట్టింది లేదు. మొత్తం లాసే. చాపలు పోతే పోయినగాని పంటలన్నా దక్కాలెగదా! – జెట్టి తిరుపతి, మొగ్దుంపూర్