ఏడాదిన్నర కిందటి వరకు పుష్కలమైన నీళ్లతో కనిపించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ఇప్పుడు కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ప్రభుత్వ ప్రణాళికా లోపంతో సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూగర్భజలాలు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతుండగా, కాలువల్లో నీరు రాక రైతులు బోర్లు, బావుల బాట పడుతున్నారు. అప్పులు తెచ్చి మరీ తవ్విస్తున్నారు. అయినా పెద్దగా ప్రయోజనం లేక పంటలను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.
కరీంనగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గంగాధర : తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చి వేశారు. ప్రాజెక్టులు పూర్తి చేసి కడుపునిండా సాగునీరిచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. అంతేకాదు, రాజన్న సిరిసిల్ల లాంటి మెట్ట ప్రాంతానికి ప్రాజెక్టుల నీటిని తరలించి.. చెరువులు, కుంటలు నింపి భూగర్భజలాలు పెంచి, ఐఏఎస్‌లకే ఒక పాఠ్యాంశంగా మార్చారు. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్లీ సమైక్య రాష్ట్ర పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. అప్పటి కరువు ఛాయలు రాజ్యమేలుతున్నాయి.
ప్రాజెక్టుల్లో నీళ్లున్నా.. చెరువులు, కుంటలు నింపడంలో ప్రభుత్వం వైఫల్యం అవుతుండడంతో భూగర్భజలాలు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. ఫలితంగా రైతులు తమ పంటలు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ బావుల బాట పడుతూ పాత బావులు అడుగులు తీయిస్తూ.. కొత్త బావులు తవ్విస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ బోర్లు వేయిస్తున్నారు. ఈ పరిస్థితులు మున్ముందు ఎటువైపు దారితీస్తాయో అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మచ్చుకు ఒక మండలాన్ని తీసుకొని చూస్తే.. గంగాధర మండలం వెంకంపల్లి, ఉప్పరమల్యాల, రంగరావుపల్లి, కాసారం, గర్శకుర్తి గ్రామాల పరిధిలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి.
కేసీఆర్ సర్కారు ఉన్న సమయంలో నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి ఆయా గ్రామాల్లోని చెరువులను నింపడంతో ఎండకాలంలోనూ జలకళను సంతరించుకొని సాగునీటికి భరోసానిచ్చాయి. రైతులు ఏ ఇబ్బంది లేకుండా పంటలు పండించుకున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయించి డీ4 కెనాల్ ద్వారా చెరువులు నింపడానికి ప్రభుత్వం, అధికారులు చొరవ చూపకపోవడం, నారాయణపూర్ కుడికాలువ నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఎప్పుడు చూడని విధంగా ఈ యేడాది సాగునీటి ఎద్దడి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బావుల్లో నీరు అడుగంటడంతో పంటలను కాపాడుకోవడానికి బోర్లు వేయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒక్కో రైతు రెండు, మూడు బోర్లు వేసినా చుక్కా నీరు రాక.. పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకోవడం ఎలాగో తెలియక ఆగమవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉండగా, తప్పని పరిస్థితుల్లో పంటలు కాపాడుకోవడానికి బావులు, బోర్ల బాట పట్టక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.
మధు బావిలో అడుగంటిన జలాలు
..పక్క చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు దొంగల మధు. మానకొండూర్ మండలం నిజాయితీ గూడెం. ఆయనకు మొత్తం 76 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ఎకరంలో వరి సాగు చేశాడు. 25 గుంటల్లో కూరగాయలు పండిస్తున్నాడు. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు తగ్గి పంటలు ఎండిపోతుండగా, వాటిని కాపాడుకునేందుకు తన భూమిలోని బావిని లోతుగా తవ్వుతున్నాడు. పంట దక్కాలాంటే బావి తవ్వక తప్పడం లేదని, అందుకోసం లక్ష రూపాయల దాకా ఖర్చవుతున్నదని వాపోయాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కరువు కనిపించలేదని, తన భూమికి ఫసలుకు 9,600 రూపాయల చొప్పున రైతు బంధు వచ్చేదని గుర్తు చేసుకున్నాడు. కాంగ్రెస్ వచ్చినప్పటినుంచి రైతు భరోసా కింద కేవలం రూ. 800 మాత్రమే వచ్చాయని, ఇందేంటని అధికారులను అడిగితే ఎవరూ చెప్పడం లేదని వాపోయాడు. ఈ బాయి తవ్వుడు అయినంక మళ్లీ అధికారులను కలుస్తానని చెప్పాడు.
కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండో.. ఎట్ల చేసిండో తెలియదు గానీ, టంఛన్‌గా రైతు బంధువేసిండని గుర్తు చేశాడు. ఇప్పుడు మాత్రం అట్ల లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకే ఒకసారి అది కూడా నాకే రూ. 800 పడ్డయంటే అర్థం చేసుకోవాలని చెబుతున్నాడు. అప్పుడున్న భూమి.. ఇప్పుడున్న భూమి ఒక్కటేనని, గుంట కూడా అమ్మలేదని, కాంగ్రెసోళ్లు ఎన్నికల్లో జెప్పింది జూస్తే.. ఇంకా ఎక్కువ రావాలే గానీ, రూ. 800 మాత్రమే వేసిండని, ఎందుకు అట్ల జేసిండ్రో తెలియదంటున్నాడు. ఇక నీళ్ల పరిస్థితి ఇట్లనే ఉందని వాపోతున్నాడు.
బావి తవ్వుతున్న ప్రొక్లెయినర్, రైతు సరోజన (ఇన్సెట్)
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళా రైతు పేరు సరోజన. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ గ్రామం. ఆమెకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. యాసంగిలో వరిసాగు చేసింది. నిజానికి మొగ్దుంపూర్ వరకు ఎస్సారెస్పీ కెనాల్ ఉంది. కానీ, సరిపడా నీళ్లు రావడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయి. వేసిన వరి పంటను కాపాడుకోవడానికి సరోజ నానా పాట్లు పడుతున్నది. తన పాత బావి వినియోగించుకోవడానికి గంటకు నాలుగు వేల రూపాయలు ఖర్చు చేసి పొక్లెయినర్‌తో పూడిక తీయిస్తున్నది. కేసీఆర్ సారు ఉన్నప్పుడు కాలువలో పుష్కలంగా నీళ్లు చివరకు అచ్చేవని, ఇప్పుడు అప్పుడప్పుడు ఇస్తున్నా చివరి వరకు రావడం లేదని సరోజన వాపోతున్నది. అందుకే పంటను కాపాడుకునేందుకు గత్యంతరం లేక చేతిలో డబ్బులు లేకపోయినా పూడిక తీపిస్తున్నానని చెబుతున్నది.
700 ఫీట్లు వేసినా చుక్కా నీరు రాలేదు
గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన అట్టిపల్లి మధుకు కురిక్యాల, ఉప్పరమల్యాల గ్రామాల శివారులో 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. కేసీఆర్ సర్కారు హయాంలో చెరువుల్లో నీరు నిండుగా ఉండడంతో ఉన్న ఒక్క బావి, బోరుతోనే పొలానికి నీళ్లు పెట్టి పంటలు పండించాడు. ప్రస్తుతం పరిస్థితి మారింది. బావిలో నీళ్లు లేకపోవడంతో నాలుగున్నరెకరాల్లో మాత్రమే వరి సాగు చేశాడు. బావిలో నీరు అడుగంటడంతోపాటు ఉన్న ఒక్క బోరు వట్టిపోయింది. దీంతో పంటను కాపాడుకోవడానికి లక్షా 80 వేల రూపాయలతో మరో బోరు వేయించినా చుక్కా నీరు రాలేదు. దీంతో మధు ఆందోళన చెందాడు. ఎలాగైన పంటను కాపాడుకోవలన్న ఉద్దేశంతో 98 వేల రూపాయలతో మరో బోరు వేశాడు. రెండు బోర్లు వేస్తే.. ఒక్క బోరు నుంచి కొద్ది పాటి నీరు మాత్రమే వస్తున్నదని మధు వాపోయాడు. బావిలో ఉన్న కొద్ది పాటి నీటితో పొలాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
నాలుగు చెరువులున్నా.. ఒక్క దాంట్లో నీరు లేదు
గంగాధర మండలం ఉప్పరమల్యాలకు చెందిన అమిరిశెట్టి రవికి పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అందులో ఏడెకరాల్లో వరి, మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. బావిలో నీరు అడుగంటడంతో రెండు లక్షల రూపాయలతో రెండు బోర్లు వేయించాడు. అయినా రెండు బోర్లలో నీరు రాలేదు. ఏడెకరాల్లో నాలుగెకరాల్లో వరి ఎండిపోగా, మిగిలిన పంటను కాపాడుకోవడానికి తండ్లాడుతున్నాడు. బావిలో ఉన్న కొద్దిపాటి నీటితో రోజు విడిచి రోజు నీరు పెడుతున్నాడు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు నారాయణపూర్ కెనాల్ నుంచి ఊర్లో ఉన్న నాలుగు చెరువులను నింపడంతో సాగునీటికి ఇబ్బంది రాలేదని రవి గుర్తు చేస్తున్నాడు. ప్రస్తుత పాలకులు ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో గతంలో ఎప్పుడు చూడని విధంగా బావుల, బోర్లు ఎండిపోతున్నాయని, పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.