Urea | రాయికల్, సెప్టెంబర్ 1 : యూరియా కోసం నిత్యం రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూరియా వస్తుందనీ రైతులకు సమాచారం తెలిస్తే చాలు యూరియా కోసం రైతులు అన్ని పనులు మానుకొని వర్షం కురుస్తున్నా సొసైటీ ల ముందు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. రాయికల్ మండలం భూపతిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని తాట్లవాయ గ్రామంలో ఉన్న సొసైటీ గోదాంకు సోమవారం యూరియా వస్తుందన్న సమాచారంతో ఆ ప్రాంత రైతులు వర్షం కురుస్తున్నా ఉదయం నుండి గోదాం ముందు బారులు తీరారు.
రైతులు గొడుగులు, ఒంటిపై వర్షం నుండి తడవకుండా ఉండేందుకు రక్షణ కవచాలని వేసుకుని గోదాం ముందు యూరియా కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు యూరియా లోడ్ తో లారీ అక్కడకు రావడంతో రైతులు ఒక్కసారిగా రోడ్డుపైకి వెళ్లి యూరియా లారీని అక్కడి ఆపి దాని ముందు రోడ్డుపై బైఠాయించి, గణపతి బొప్పా బోరియా.. యూరియా ఏదయా.. అంటూ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై సుధీర్ రావు, వ్యవసాయ అధికారులు, సొసైటీచైర్మన్, అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసినా రైతులు కొంతసేపు వారు వినలేదు.
ఎప్పుడు యూరియా వచ్చిన అధికారులు ఏదో ఒక సాగు చెబుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈసారి మాత్రం మాటలు వినేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈసారి వచ్చిన యూరియాను తాట్లవాయ చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన రైతులకు ఇస్తామని, మళ్లీ వచ్చే లోడును ఒడ్డె లింగాపూర్ రైతులకు ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు శాంతించారు.