UREA | ధర్మారం, సెప్టెంబర్ 8 : పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం రైతులు రాస్తారోకో చేశారు. గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఉండడం, ఆదివారం సెలవు దినం కావడంతో యూరియా రాకపోవడంతో ధర్మారం, కొత్తపల్లి, బొమ్మ రెడ్డి పల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ నాలుగు గ్రామాలకు ధర్మారంలోని సీఎస్సీ ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా కేటాయిస్తున్నట్లు ఇదివరకే వ్యవసాయ అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికంగా ఉన్న ఫర్టిలైజర్ దుకాణం వద్దకు రైతులంతా చేరుకొని యూరియా కావాలని అడిగారు. కానీ తమ దుకాణానికి ప్రభుత్వం యూరియా కేటాయించలేదని చెప్పడంతో రైతులంతా కరీంనగర్-రాయపట్నం రహదారిపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు.
యూరియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. వాన కాలంలో సాగుచేసిన వరి పొలాలకు రెండవసారి వేయడానికి యూరియా లేకపోవడంతో పెట్టిన పెట్టుబడును నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల గురించి వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో సుమారు అరగంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడి సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.
రైతుల ఆందోళన పై మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారి భాస్కర్ ను వివరణ కోరగా సోమవారం సాయంత్రం వరకు 80 టన్నుల యూరియా వస్తుందని అట్టి యూరియాను వివిధ ప్రాంతాలకు కేటాయిస్తామని వివరించారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. ధర్మారం, కొత్తపల్లి, బొమ్మరెడ్డిపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాల రైతులకు ధర్మారంలోని సింగిల్ విండో గోదాంలో రేపటి నుంచి యూరియా పంపిణీ చేస్తామని ఆయన వివరించారు.
యూరియా వేయక పొలం తెల్లబడిపోతుంది.. : అజ్మీరా రాజేశం, రైతు, కొత్తపల్లి
నాకు గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. అందులో వరి పొలం వేశాను. ఒకటేసారి యూరియా వేశాను. మళ్లీ రెండవసారి యూరియా వేద్దాం అనుకుంటే యూరియా కొరత ఉందని అంటున్నారు. రోజుల తరబడి ధర్మారం వచ్చి పోతున్నాం కానీ యూరియా దొరకడం లేదు. యూరియా వేయకపోవడంతో పొలం తెల్లబడిపోతుంది. పెట్టిన పెట్టుబడులు నష్టపోతామని బాధ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం సరిపడా యూరియా తెప్పించి రైతులను ఆదుకోవాలి
ఒక్కసారి కూడా యూరియా వేయలేదు.. : భూక్య కళ, మహిళారైతు, కొత్తపల్లి
మాకు ఎకరం పొలం ఉంది. అందులో వరి నాటు వేసినం. నాటు పెట్టినప్పటి నుంచి యూరియా వేయలేదు. ఎన్నిసార్లు ధర్మారం వచ్చి పోయిన ఒక బస్తా యూరియా కూడా దొరకడం లేదు. ఎకరానికి రెండు బస్తాల యూరియా వేస్తే పొలం దక్కుతుంది. ఇప్పుడు యూరియా లేదని అంటున్నారు ఏమి చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా యూరియా తెప్పించి పొలాలను కాపాడాలి.