Heart attack | సిరిసిల్ల రూరల్,జూలై 11: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ లో ఓ రైతు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలోవిషాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్వాపూర్ కు చెందిన అనవేని దేవయ్య (55) అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 6న తన పశువులను మేపేందుకు గ్రామ శివారుకు వెళ్లిన దేవయ్య, అక్కడే ఒడ్డు పైన కుప్పకూలి పడిపోయాడు.
సాయంత్రం అయినా ఇంటికి చేరకపోవడంతో, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బర్రెల మేపేందుకు వెళ్లిన దేవయ్యను అక్కడ ఒడ్డుపై పడిపోయి ఉండటం చూసి, కుటుంబ సభ్యులు , స్థానికులు వెంటనే సిరిసిల్ల దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలించారు. కరీంనగర్ లోని ప్రతిమ దవఖానలో చేర్పించి వైద్యం చేయించారు. వైద్యులు పరీక్షించి గుండెపోటు రావడంతో స్టంట్ కూడా వేశారు. అయినప్పటికీ కోమాలో ఉన్న దేవయ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం దవాఖానాలోని మృతి చెందాడు.
దేవయ్య మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. దేవయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నది. రెండు సంవత్సరాల క్రితం అప్పులు చేసి, కూతురు వివాహం చేశాడు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. దేవయ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. దేవయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.