Fake calls | కార్పొరేషన్, జూలై 5 : సైబర్ నేరగాళ్లు ఏకంగా అధికారుల పేరుతో అక్రమాలకు తెరలేపారు. నగరపాలక సంస్థకు పన్నులు బకాయి ఉన్నారని వెంటనే చెల్లించాలంటూ ఫోన్ చేయడంతో పాటుగా బిల్లుల చెల్లింపుల కోసం స్కానర్ పంపిస్తున్నామంటూ దండుకుంటున్నారు. దీని కోసం ఏకంగా నగర మున్సిపల్ కమిషనర్ పేరును వాడుకోవడం గమనార్హం.
నగరంలోని పలువురు వ్యక్తులకు గత రెండు రోజులుగా ఫోన్ చేస్తూ ‘నగర మున్సిపల్ కమిషనర్‌ను మాట్లాడుతున్నాను. మీరు నగరపాలక సంస్థకు పన్నులు బకాయి ఉన్నారు…. చెల్లించండి.. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, చెల్లింపుల కోసం పేటీఎం స్కానర్ పంపిస్తున్నామని దాని చెల్లించాలి’ అంటూ ఫోన్లు చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల సైతం చేశారు. నగరంలో గత రెండు రోజుల నుండి కమిషనర్ పేరుతో 9121097923 నంబర్‌తో పాటు ఇతర ఫేక్ నెంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్‌ను ఎవరు నమ్మవద్దని సూచించారు.
పన్నులు చెల్లించాలంటూ ఫోన్ చేయడంతోపాటుగా, పేటీఎం స్కానర్ పంపిస్తామని ఆన్లైన్లో మీ పన్నులు చెల్లించాలని కొంత మంది సైబర్ క్రైం కార్యకలాపాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారి ఫేక్ ఫోన్‌కాల్స్ విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరపాలక సంస్థకు చెందిన ఎలాంటి ఆస్తి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు ఇతర ఎలాంటి పన్నుల బకాయిలు ఉన్న సకాలంలో నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయంలో గల పౌర సేవా కేంద్రంలో, నగరపాలక సంస్థలో బిల్ కలెక్షన్ డివైస్ యంత్రాలతో వచ్చే బల్దియా ఉద్యోగులకు మాత్రమే పన్నులు చెల్లించాలని కోరారు. అలాగే మీ సేవా కేంద్రంలో, సీడీఎంఎ అన్లైన్లో ఇంటి నంబర్ ద్వారా చెల్లింపులు చేసుకొవాలని సూచించారు.
ప్రతీ ఆర్థిక సంవత్సరం వారిగా పన్నులు ఎలాంటి బకాయి లేకుండ వడ్డీ భారం పడకుండా నగరపాలక సంస్థ కార్యాలయంలో నేరుగా చెల్లించవచ్చునని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ పేరుతో వచ్చే ఫేక్ ఫోన్‌కాల్స్‌ను ఎవరు నమ్మవద్దని, ఈ కాల్స్‌తో సైబర్ క్రైం పాల్పడే వారిపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఫేక్ ఫోన్ కాల్స్ విషయంపై పోలీసులకు కుడా ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు.