గోదావరిఖని, ఆగస్టు 10 : కేసీఆర్ పాలనలో నిండుకుండలా మారిన గోదావరి నదిని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతి ఉన్నా నీటిని ఎత్తిపోయడం లేదని మండిపడ్డారు. ఆదివారం ఆయన గోదావరిఖని శివారులో ఎడారిగా మారిన గోదావరి నదిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది నిండుకుండలా ఉండేదని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పడవల పోటీలు నిర్వహించామని చెప్పారు. కానీ, ఇరువై నెలల కాంగ్రెస్ పాలనలో ఎడారిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ సాగునీరు ఇవ్వకుండా రైతులను అరిగోస పెడుతున్నదని ఆగ్రహించారు.
ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్‌రెడ్డి అబద్దాలు ప్రచారం చేసి గెలిచాక ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేపట్టకుండా కేసీఆర్‌పై అక్కసుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పంటలు ఎండిపోకుండా రైతులకు సాగునీరు ఇవ్వాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, గాదం విజయ, బాదె అంజలి, టీబీజీకేఎస్ నాయకులు పర్లపల్లి రవి, కొమురయ్య, వడ్డెపల్లి శంకర్, బీఆర్ఎస్ నాయకులు అచ్చె వేణు, తోకల రమేశ్, చెలకలపల్లి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, కాల్వ శ్రీనివాస్, పీచర్ల శ్రీనివాస్, జక్కుల తిరుపతి, అల్లం ఐలయ్య, కేశవగౌడ్, శ్రావణ్, చింటు, సట్టు శ్రీనివాస్, రవీందర్, భానుచందర్, నూతి తిరుపతి, గుంపుల లక్ష్మి, ఆర్శనపల్లి శ్రీనివాస్, బండారి ప్రవీణ్, పద్మ, సుజాత, వెంకటేశ్, కిరణ్ ఉన్నారు.