Ramagundam Baldia | కోల్ సిటీ, మార్చి 7 : రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో శనివారం అతివలు ఆడవిడుపుతో సరదాగా గడిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా వేడుకగా జరుపుకున్నారు. మహిళా ఉద్యోగిణులు, ఆర్పీలు, స్వశక్తి మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్, బాస్కెట్ బాల్ తదితర స్నేహపూర్వక క్రీడా పోటీలు నిర్వహించగా, మహిళలు ఉల్లాసంగా… ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
విజేతలకు మేయర్ మహంకాళి స్వామి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉద్యోగులకు, మహిళా కార్పొరేటర్లకు, ఆర్పీలకు మెమెంటోలతోపాటు శాలువాలు కప్పి సత్కరించారు. మేయర్ మాట్లాడుతూ స్వశక్తి మహిళలతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోలు బంక్ లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదనీ, అమృత్ మిత్ర పథకం ద్వారా మహిళలకు మున్సిపల్ కాంట్రాక్ట్ పనులు అప్పగించనున్నమాని తెలిపారు.
మెప్మా ద్వారా వ్యాపారాలు అరంభించడానికి రుణ సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు భాగ్యలక్ష్మీ, రమాదేవి, మౌనిక, నగర పాలక సంస్థ ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, ఏఈ తేజస్విని, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, మెప్మా టీఎంసీ మౌనిక, సీఓలు ఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, ఆర్పీలు పాల్గొన్నారు.