రాంనగర్, ఫిబ్రవరి 14: రాష్ట్ర హైకోర్టు తీర్పుతో ప్రిలిమినరీ పరీక్షలో ఏడు మార్కులు కలుపడం ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగా లకు అర్హత సాధించిన అదనపు అభ్యర్థులకు బుధవారం నుంచి శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు కరీంనగర్ బైపాస్ రోడ్డులోని సిటీ పోలీసు శిక్షణకేంద్రం (సీటీసీ)లో జరుగనున్నాయి. ఈ పరీక్షలకు 6862 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో 4862 మంది పురుషులు, 1958 మంది మహిళలు, ఇతర కేటగిరీలకు చెందిన 42 మంది అభ్యర్థులు ఉన్నారు. బుధవారం నుంచి ఈ నెల 21వరకు పరీక్షలు జరుగనున్నాయి. శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించి తొలుత ధ్రువపత్రాల పరిశీలన, రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్, రిస్ట్ బ్యాండ్ ట్యాగింగ్ ప్రక్రియ జరుగుతుంది. తర్వా త ఆర్ఎఫ్ఐడీ చిప్ జాకెట్ ధరించి అభ్యర్థులు పరుగులో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ఎత్తు, కొలతలను తీసుకుంటారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణం గా ఎత్తు కలిగిఉన్న వారికి లాంగ్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
ఇవీ పరీక్షలు..
పురుష అభ్యర్థులు 1600 మీటర్ల పరుగును 7నిమిషాల 15 సెకన్లలోపు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 9 నిమిషాల 30 సెకన్లలోపు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 5నిమిషాల 20 సెకన్లలోపు పూర్తిచేయాలి. అలాగే షాట్‌పుట్‌లో భాగంగా పురుష అభ్యర్థులు 7.26కిలోల బరువును కనీస దూరం 6 మీటర్లు,
మహిళా అభ్యర్థులు 4కిలోల బరువును కనీసదూరం 4మీటర్లు విసరాల్సి ఉం టుంది. లాంగ్ జంప్‌లో పురుష అభ్యర్థులు కనీస దూరం 4 మీటర్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కనీస దూరం 3.50 మీటర్లు, మహిళా అభ్యర్థులు కనీస దూరం 2.50 మీటర్లు జంప్ చేయాల్సి ఉంటుంది.
పాటించాల్సిన నియమ, నిబంధనలు
పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక విధానం
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక విధానం పారదర్శకంగా జరుగుతుంది. ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థుల ప్రతిభ శక్తి సామర్థ్యాల పైనే ఆధారపడి ఉంటుంది. దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. వక్రమార్గంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ ఆశచూపే వారికి సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియజేయాలి. దళారులను ఆశ్రయిస్తూ అవకతవకలకు పాల్పడే ప్రయత్నం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు