కరీంనగర్ కార్పొరేషన్, డిసెంబర్ 26 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల సర్పంచుల సన్మానసభలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అనంతరం సుంకె మాట్లాడారు. కేసీఆర్ సకలజనులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, తెలంగాణను పదేళ్లలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అలాంటి తెలంగాణ బాపు కేసీఆర్‌పై సీఎం స్థాయిలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, రైతులకు నవంబర్‌లో వేయాల్సిన రైతుభరోసా వేయకుండా రేవంత్‌రెడ్డి మతిభ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని విమర్శించారు. తాము కూడా తిట్టడం మొదలుపెడితే హుస్సేన్‌సాగర్‌లో బండగట్టుకుని దూకి చస్తావని ఆగ్రహించారు.
కేసీఆర్ ఏం మాట్లాడారో ఆయనకు అర్థమైందా..? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తిరిగి వచ్చిందని, రెండేళ్ల కాలంలో సీఎంగా ఏం చేశావని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి పది శాతం పనులు కూడా పూర్తి చేయని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని, ఆ పార్టీని భూస్థాపితం చేసే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను పట్టుకొని, నీ అమ్మ అనడంతోనే మహిళలపై రేవంత్‌రెడ్డికి ఏపాటి గౌరవం ఉన్నదో అర్థం అవుతుందన్నారు. మహిళలను కించపరిచిన ఏ ఒకడు కూడా బాగుపడలేదని, భూస్థాపితం అయ్యారని విమర్శించారు. మంత్రులు, కాంగ్రెస్ నేతలు వెంటనే రేవంత్‌రెడ్డిని ఎర్రగడ్డ దవాఖానలో చూపించాలని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు చుక శ్రీనివాస్, బొంకురి మోహన్, మాచర్ల వినయ్, నవీన్‌రావు, తిరుపతి, మల్లేశం, మురళి, వెంకట రమణారెడ్డి, విజయేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.