కార్పొరేషన్, సెప్టెంబర్ 12 : ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే కట్టామని, ఎల్లంపల్లి నుంచి మూసీకి జలాలను తరలిస్తున్నామని కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రాజెక్టులపై కనీస అవగహన లేకుండా మాట్లాడడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హితవుపలికారు. అబద్ధాలతో కాలం గడపవద్దని, ప్రజలకు సంక్షేమ పనులు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు.
ఎల్లంపల్లి తామే కట్టామని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారంటే అంతకంటే దిక్కుమాలిన అబద్ధం మరొకటి ఉండదన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును 2004లో 3,177 కోట్లతో చేపట్టారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి అందులో 5 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేయలేని పరిస్థితి ఉందంటే ఎలా నిర్మించారో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయలేకపోయారని, ముంపు బాధితులకు పునరావసం కల్పించలేకపోయారన్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2,052 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును 2016లో పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చిందని గుర్తు చేశారు. అలాగే మిడ్‌మానేరును కూడా 1586 కోట్ల వ్యయంతో పూ ర్తి చేయించి వినియోగంలోకి తెచ్చిందని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీల్లో ఎన్టీపీసీకి 6.5 టీఎంసీలు, మిషన్ భగీరథ, రామగుండం ఫర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్‌కు నీటి సరఫరా చేయాల్సి ఉందన్నారు. వీటితో పాటు 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంటుందన్నారు.
ఈ అవసరాలకే ఎల్లంపల్లి నీరు సరిపోని పరిస్థితి ఉంటే మూసీకి 20టీఎంసీలు రేవంత్‌రెడ్డి ఎక్కడి నుంచి తీసుకుపోతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పు డు ప్రచారంచేస్తున్న రేవంత్‌రెడ్డి మల్లన్నసాగర్‌కు ఎలా నీళ్లు వస్తున్నాయో చెప్పాలన్నారు. మల్లన్నసాగర్‌కు నీరు వస్తుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సాధ్యమైందన్నారు. రేవంత్‌రెడ్డి గండిపేట వద్ద కొబ్బరికాయ కొట్టి మూసీకి తరలిస్తామంటున్న నీళ్లు కూడా కాళేశ్వ రం ప్రాజెక్టు నుంచే వస్తున్నాయని చెప్పారు.
తెలంగా ణ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులన్నింటినీ తామే చేసినట్టు కాంగ్రెస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టులో మూడు పంపుహౌస్‌లు పూర్తిచేస్తే, తామే చేశామని చెప్పుకొన్న ఘనత కాంగ్రెస్‌దేనని ఎద్దే వా చేశారు. రైతులను యూరియా కోసం ప్రభుత్వం మూడు నెలలుగా గోస పెడుతున్నదని ఆగ్రహించారు. యూరియాపై సబ్సిడీని ఎత్తివేయాలన్న కుట్రతోనే కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొరత సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. రైతులను గోస పెట్టడం మంచిది కాదని హిత వు పలికారు. ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు.