పెద్దపల్లి కమాన్, ఆగస్టు 6 : కాంగ్రెస్ అంటేనే మోసమని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి అందరినీ గోసపెడుతున్నదని అని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలన్న బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై మంత్రి అడ్లూరి విమర్శలు సరికాదని సూచించారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కొప్పుల ఈశ్వర్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కన్నెపల్లి పంపుహౌస్ సందర్శనకు వెళ్లిన కొప్పులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రం రాక ముందు నీళ్లు, నియామకాలు, నిధులు కోసం ఎలాగైతే పోరాటాలు చేశామో..? ఇప్పుడు మళ్లీ అవే పోరాటాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు గోపు ఐలయ్య యాదవ్, గంట రాములు యాదవ్, ఉప్పు రాజ్‌కుమార్, నారాయణదాసు, మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, పెంచాల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, వెన్న రవీందర్, పల్లె మధు, కుక్క మనోజ్, కమటం శ్రీధర్, ముత్యం లక్ష్మణ్ గౌడ్, మేకల కొమురయ్య, ఇరుగురాళ్ల శ్రావణ్, కర్రావుల రామరాజు, బండి ప్రదీప్ గౌడ్ ఉన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మి అధికారమిస్తే తెలంగాణ ప్రజానీకాన్ని నట్టేట ముంచిన్రు. ఎండుతున్న పంటలను చూడలేక సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కన్నెపల్లిని సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై అర్ధ రహిత వ్యాఖ్యలు చేయడం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అవివేకానికి నిదర్శనం. మంత్రిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి, పెద్దపల్లి జిల్లాకు ఏమి చేస్తారో హామీ ఇవ్వకుండా, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ హయాంలో పదకొండు సార్లు సుమారు రూ.80వేల కోట్ల రైతుబంధు ఇచ్చి, రెండుసార్లు రుణమాఫీ చేసిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టి, అరకొర రుణమాఫీ చేసింది. మేడిగడ్డ బరాజ్‌లో నీళ్లు ఉంటే గుండారం, నందిమేడారం రిజర్వాయర్లు నిండుకుండలా ఉండేటివి. ఇప్పటికైనా మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేసి నీళ్లియ్యాలి. అందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలి. సాగునీరు అందక పంటలు ఎండిపోతే రైతుల చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదు.