ఎస్సారెస్పీ ఎగువ ఆయకట్టుకు నేటి నుంచి నీటిని విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. కానీ, ప్రభుత్వం కాలువల మరమ్మతులు మరిచిపోయింది. కాలువల లైనింగ్ దెబ్బతిని, అనేక చోట్ల బుంగలు పడ్డాయి. పూడిక కూరుకుపోయి, పిచ్చిమొక్కలు పెరిగి పూర్తిగా అధ్వానంగా మారాయి. ఈ పరిస్థితుల్లో చివరి ఆయకట్టుకు నీటిని ఎలా సరఫరా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాలువలు బాగు చేయకుండా నీరందించడం గగనమేనని తెలుస్తుండగా, ప్రణాళిక లేని ప్రభుత్వంపై రైతాంగం మండిపడుతున్నది. ఆన్, ఆఫ్ పద్ధతిలో నీరిస్తామని, ఆఫ్ పద్ధతి అమలులో ఉన్నప్పుడు మరమ్మతులు చేస్తామని అధికారులు చెబుతుండగా.. ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతానికి నేటి నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని 4.62 లక్షల ఎకరాలకు నీళ్లించేందుకు ప్రాజెక్టు అధికారులు నీటి ప్రణాళిక ఖరారు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 80.5 టీఎంసీలు అందుబాటులో ఉండగా, అందులో 5 టీఎంసీలు దిగువ ఆయకట్టుకు, 62 టీఎంసీలు ఎగువ ఆయకట్టుకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్న 3.80 లక్షల ఎకరాలకు బుధవారం నుంచి ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తారు. కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే డీ-87 నుంచి డీ- 94 వరకు ఉన్న డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీటిని రిలీజ్ చేయనున్నారు. అయితే కాలువల పరిస్థితి చూస్తే మాత్రం మరోలా ఉన్నది. చాలా చోట్ల శిథిలావస్థకు చేరాయి. డ్రాప్ట్లు కూలి పోయాయి. పూడిక కూరుకుపోయి, చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి, గండ్లు పడి పూర్తిగా అధ్వానంగా మారిపోయాయి. కాలువలకు ఎలాంటి మరమ్మతులు చేయకుండానే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
కరీంనగర్ జిల్లా పరిధిలోని డీ-89, డీ-94 కాలువల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారింది. కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని కాలువల్లో ఎక్కడ చూసినా పగిలిన డ్రాప్ట్లు, తెగిన లైనింగ్ కనిపిస్తున్నాయి. నీరు పారకుండా పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డంగా ఉన్నాయి. కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల, మొగ్దుంపూర్, ఎలబోతారం గ్రామాల పరిధిలో చూస్తే ఈ కాలువల నుంచి నీళ్లు ఎలా పారుతాయనే సందేహాలు తప్పక వ్యక్తమవుతాయి. డీ-89 కాలువ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సాంబయ్యపల్లి, గొల్లపల్లి వరకు వెళ్తుంది. ఈ గ్రామాల్లో సైతం ప్రధాన కాలువ పరిస్థితి అధ్వానంగా ఉన్నది. కాలువలకు పడిన గండ్లు పూడ్చకపోతే కరీంనగర్, సుల్తానాబాద్ మండలాల్లోని చివరి ఆయకట్టుకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. డీ-89 ప్రధాన కాలువ పరిధిలోని ఉప కాలువల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇక డీ-94 ప్రధాన కాలువ ద్వారా కరీంనగర్ మండలంలోని గోపాల్పూర్, దుర్శేడ్, చేగుర్తి, బొమ్మకల్ గ్రామాలకు సాగునీరు అందుతున్నది. కొత్తపల్లి మండలం మల్కాపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కాలువ రేకుర్తి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ వరకు మున్సిపల్ నిధులతో పూడిక పనులు చేశారు. అక్కడి వరకు బాగానే ఉన్న కాలువ ఆ తర్వాత అధ్వాన పరిస్థితిలో ఉంది.
ప్రాజెక్టు ఎగువ ప్రాంతానికి నీళ్లు ఇస్తూనే కాలువల్లో పూడిక తొలగింపు, మరమ్మతు పనులు చేపడతామని ఎస్సారెస్పీ అధికారులు చెబుతున్నారు. నీటిని ఆన్, ఆఫ్ పద్ధతిలో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆఫ్ పద్ధతి అమలులో ఉన్నప్పుడు కాలువల్లో పూడిక తొలగింపు, మరమ్మతులు చేపట్టాలని ఇటీవల పోచంపాడు ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది. అయితే అందుకు అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయనట్టు తెలిసింది. మొత్తం ఏడు తడుల్లో నీళ్లిచ్చే అవకాశం ఉండగా.. మొదటి తడి కింద ఇచ్చిన నీళ్లు ఇలాంటి అధ్వానమైన కాలువ గుండా చివరి ఆయకట్టుకు ఎలా చేరుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చే ముందు మరమ్మతులు చేపడితే బాగుండేదని, తీరా ఇప్పుడు నీటిని విడుదల చేసిన తర్వాత ఎలా మరమ్మతులు చేస్తారని వాపోతున్నారు.
ఎస్సారెస్పీ పరిధిలోని ఎగువ ఆయకట్టుకు 62.88 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నారు. కాలువ దిగువ ప్రాంతంలో ఉన్న డీ-54 నుంచి డీ 94 వరకు విడుదల చేసిన ప్రతి సారి 5,500 క్యూసెక్కులు, ఎగువ ప్రాం తంలో ఉన్న డీ- 5 నుంచి డీ-53 వరకు 3,500 క్యూసెక్కుల నీటిని ఇవ్వనున్నారు. మొదటి సారి డీ- 54 నుంచి డీ-94 వరకు ఉన్న డిస్ట్రిబ్యూటరీలకు నీటిని ఇస్తున్నారు. డీ-54 నుంచి డీ-94 వరకు ఉన్న డిస్ట్రిబ్యూటరీలకు డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు మొదటి, జనవరి 9 నుంచి 17 వరకు రెండు, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు మూడు, ఫిబ్రవరి 8 నుంచి 16 వరకు నాలుగు, ఫిబ్రవరి 23 నుంచి 3 వరకు ఐదు, మార్చి 10 నుంచి 18 వరకు ఆరు, మార్చి 25 నుంచి 2 ఏప్రిల్ వరకు ఏడు విడుతల్లో సాగు నీరు విడుదల చేయనున్నారు. అలాగే డీ-5 నుంచి డీ -53 వరకు.. జనవరి 2 నుంచి 9 వరకు మొదటి, జనవరి 17 నుంచి 24 వరకు రెండు, ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు మూడు, ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు నాలుగు, మార్చి 3 నుంచి 10 వరకు ఐదు, మార్చి 18 నుంచి 25 వరకు ఆరు, ఏప్రిల్ 2 నుంచి 9 వరకు ఏడు విడుతల్లో నీటిని రిలీజ్ చేయనున్నారు.