అసెంబ్లీ సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. నేడు జరిగే ఎన్నికల సమరానికి జిల్లా యంత్రాంగం రెడీ అయింది. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ జరగనుండగా, అందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. మొత్తంగా 1,338 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని బుధవారమే పంపింది. జిల్లాలో 289 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించింది. నాలుగు నియోజకవర్గాల పరిధిలో 73 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, 10,59,215 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణకు 4,872 మంది సిబ్బంది, అధికారులు విధులు నిర్వర్తిస్తుండగా, మూడు వేల మంది పోలీసులు బందోబస్తులో తలమునకలు కానున్నారు. పోలింగ్ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు.
-కరీంనగర్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): నేటి అంసెబ్లీ ఎన్నికలకు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. 12 నియోజకవర్గాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ జరగనున్నది. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 1,338 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందుకు 2,541 బ్యాలెట్ యూనిట్లు, 1,671 కంట్రోల్ యూనిట్లు, 1,872 వీవీ ప్యాట్స్‌ను కేటాయించారు. అలాగే 1,218 మంది ప్రిసైడింగ్ అధికారులు, మరో 1,218 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 2,436 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒకరి చొప్పున 1,338 మంది బూత్ స్థాయి అధికారులను నియమించారు.
289 మంది సూక్ష్మపరిశీలకులను, 20 మంది నోడల్ అధికారులు, మరో 124 మంది సెక్టోరల్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. అలాగే, ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు 1,200 మంది స్థానిక, 1,800 మంది సెంట్రల్ పోలీసు కలిపి 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విధులు ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారితోపాటు జిల్లాలోని 16 మంది తహసీల్దార్లు అదనపు రిటర్నింగ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూస్తే 4,872 మంది ఎన్నికల సిబ్బందికి అదనంగా 560 మంది చొప్పున 5,812 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరు కాకుండా వెబ్‌కాస్టింగ్ కోసం ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక వీడియో గ్రాఫర్ చొప్పున 1,338 మందిని నియమిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే నాలుగు నియోజకవర్గాల్లో సిబ్బంది, పోలీసు ఫోర్స్ కలిపి 10 వేలకుపైగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
ఓటేద్దాం రండి
ఓటు.. మన చేతిలో వజ్రాయుధం. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాస్త్రం. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఇదే శక్తివంతమైన ఆయుధం. అదే మెరుగైన సమాజానికి బాటలు వేస్తుంది. మీ, మీ పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడా అస్త్రం సంధించే సమయం ఆసన్నమైంది. ఓటరు మహాశయులారా ఈ రోజు మీదే. మీకు మేలుచేసిందెవరో ఆలోచించండి. ఆగమాగం కాకుండా విచక్షణతో ఓటు వేయండి.
కరీంనగర్లో..
కీలకమైన కరీంనగర నియోజకవర్గంలో 27 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 3,55,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 133 లొకేషన్లలో 390 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 975 బ్యాలెట్ యూనిట్లు, మరో 487 కంట్రోల్ యూనిట్లు, 546 వీవీ ప్యాట్స్‌ను కేటాయించారు. ఇక్కడ విధులు నిర్వహించేందుకు 429 మంది ప్రిసైడింగ్, 429 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్, మరో 858 ఇతర ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. 33 సెక్టార్లను గుర్తించి 33 మంది సెక్టోరల్ అధికారులను నియమించారు.
చొప్పదండిలో..
చొప్పదండి నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2,32,990 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 178 లొకేషన్లలో 327 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. 408 బ్యాలెట్ యూనిట్లు, మరో 408 కంట్రోల్ యూనిట్లు, 457 వీవీ ప్యాట్స్ కేటాయించారు. ఎన్నికల నిర్వహణకు 196 మంది పీఓలు, 196 మంది ఏపీఓలు, 392 మంది ఓపీఓలను నియమించారు. 32 సెక్టార్లను గుర్తించి 32 మంది సెక్టోరల్ అధికారులను నియమించారు.
మానకొండూర్‌లో..
మానకొండూర్ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులు పోటీ ఉండగా 2,21,613 మంది ఓటర్లు తమ ఓట్లు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నియోజవర్గంలో 171 లొకేషన్లలో 316 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. 395 బ్యాలెట్ యూనిట్లు, మరో 395 కంట్రోల్ యూనిట్లు, 442 వీవీ ప్యాట్స్‌ను కేటాయించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 238 మంది పీఓలు, మరో 238 మంది ఏపీఓలు, 476 మంది ఓపీఓలను నియమించారు. 29 సెక్టార్లను గుర్తించి 29 మంది సెక్టోరల్ అధికారులను నియమించారు.
హుజూరాబాద్‌లో..
హుజూరాబాద్ నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2,49,558 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నియోజకవర్గంలో 169 లొకేషన్లలో 305 పోలింగ్ కేంద్రాలు ఉర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. 763 బ్యాలెట్ యూనిట్లు, మరో 381 కంట్రోల్ యూనిట్లు, 427 వీవీ ప్యాట్స్‌ను ఈ నియోజకవర్గానికి కేటాయించారు. ఎన్నికలు నిర్వహించేందుకు 264 మంది పీఓలు, మరో 264 మంది ఏపీఓలు, 528 మంది ఓపీఓలను నియమించారు. 30 సెక్టార్లను గుర్తించి 30 మంది సెక్టోరల్ అధికానులను నియమించారు. బందోబస్తు కోసం 471 మంది పోలీసులు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
3 వేల మందితో పోలీసుల పహారా
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా 350 మొబైల్ వాహనాలకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఈ వాహనాలకు ఉన్న కెమెరాలు కంట్రోల్ రూంకు సమాచారం అందించడమే కాకుండా దృశ్య రూపంలో చూపించే ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ముగ్గురు లోకల్ పోలీసులు, ఐదుగురు సెంట్రల్ ఫోర్స్ పహారా ఉంటుంది. సమస్యాత్మకమైన 289 పోలింగ్ కేంద్రాల్లో అదనంగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురికి మించి గుమిగూడి ఉంటే కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. పార్టీల కార్యకర్తలు, నాయకులు కండువాలతో ప్రచారం చేయరాదని పోలీసు అధికారులు చెబుతున్నారు.
55 రోజుల్లో మొత్రం ప్రక్రియ
అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 9న షెడ్యూల్ ఇచ్చారు. నవంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ వెంటే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, 10న ముగిసింది. 13న స్రుట్ని, 15న ఉపసంహరణ ప్రక్రియ సాగింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారానికి తెరపడింది. నేడు పోలింగ్ కాగా, మరో మూడు రోజుల్లో అంటే.. వచ్చే నెల3న కౌటింగ్ జరగనున్నది. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ 55 రోజుల్లో ముగుస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య వివరాలు