విద్యానగర్, మే 4 : మొక్కల పెంపకంతోనే వాతావరణ సమతుల్యత సాధ్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి భావి తరాలకు పచ్చని ప్రకృతిని కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాను ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాననని, పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ శివారులో ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి హాజరయ్యారు. మేయర్ సునీల్‌రావు, కలెక్టర్ కర్ణన్, ఐఎంఏ బాధ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తన చిన్నతనంలో గ్రామాల్లో పెద్దపెద్ద వృక్షా లు, పచ్చని మొక్కలతో వాతావరణ సమత్యులత ఉండేదన్నారు. దీంతో కాలానుగుణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొనేదని చెప్పారు. కానీ మారిన పరిస్థితుల్లో మొక్కలను తొలగించడంతో పచ్చదనం తగ్గిపోయి వేసవిలో వానలు, చలికాలంలో ఎండకొట్టడం లాంటి మార్పులు కనిపిస్తున్నాయన్నారు.
వృక్షోరక్షతి రక్షిత అని మనం మొకలు నాటి సంరక్షిస్తే అవి మనల్ని, భావి తరాలను సంరక్షిస్తాయని చెప్పారు. చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన కరీంనగర్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఊహించనిస్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. వాడవాడలా సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఘనంగా బ్రహ్మోత్సవాలు, కళోత్సవాలు నిర్వహించుకుంటూ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాల కన్నా అద్భుతంగా, హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఏదేని కారణాలతో దవాఖానల్లో రోగి మరణిస్తే వైద్యులపై బంధువులతో సంబంధంలేని వ్యక్తు లు దాడులు చేసే పరిస్థితి ఉండేదన్నారు. కానీ పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ నిర్వహణతో అలాంటి ఘటనలకు అవకాశం లేకుండాపోయిందని చెప్పారు. ప్రస్తుత, భవిష్యత్తరాల కోసం మానేరుపై తీగల వంతెన, రివర్ ఫ్రంట్ పనులను చేపడుతున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే మూడో వాటర్ ఫౌంటెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ బల్దియాల్లో పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం మున్సిపల్ కేటాయింపుల్లో 10శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించేలా చట్టం తెచ్చిందన్నారు. హరితహారంలో భాగంగా 48 ఎకరాల్లో మియావాకీ ప్లాంటేషన్‌ను 11 చోట్ల చేపట్టామన్నారు. 11 నర్సరీల్లో 6లక్షల మొకలను సిద్ధం చేశామని వెల్లడించారు. కరీంనగర్లో 11 చోట్ల వాకింగ్ ట్రాక్‌లు, 60 ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టర్ కర్ణన్ మా ట్లాడుతూ ఐఎంఏ అధ్వర్యంలో చేపడుతున్న హరితహారానికి జిల్లా యంత్రాంగం సహకరిస్తుందన్నా రు. ఆరోగ్యకర జిల్లా నిర్మాణంలో ప్రైవేట్ వైద్యులు కీలకభూమిక పోషించాలని సూచించారు. సీపీఆర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో రాష్ట్రంలోనే జిల్లా వైద్యులు ముందున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎ స్టేట్ ప్రెసిడెంట్ బీఎన్‌రావు, మెడికల్ కౌన్సిల్ మెంబర్ చెన్నాడి అమిత్ రావు, బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్, ఎంపీపీ లక్ష్మయ్య, ఎంపీటీసీ లక్ష్మి, ఐఎంఏ జిల్లా ప్రెసిడెంట్ రామ్ కిరణ్, డాక్టర్ కిషన్, జగన్మోహన్, బంగారు స్వామి ఉన్నారు.