 
                                                            Senior Civil Judge Venkatesh | గంగాధర, అక్టోబర్ 31: న్యాయ చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని, కావున చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ అన్నారు. గంగాధర మండలంలోని కురిక్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమని పేర్కొన్నారు.
ప్రతీ పౌరుడు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉంటే తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకుంటారని పేర్కొన్నారు. బాలల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, ర్యాగింగ్ నిరోధక చట్టాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా రక్షణ చట్టాలు, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలు, పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సేవలు, పేద, బలహీన వర్గాల ప్రజలు ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి, న్యాయ సేవలు ఎక్కడ అందుబాటులో ఉంటాయో వివరంగా తెలిపారు.
రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు, విధులను గురించి తెలియజేశారు. చట్టాలపై అవగాహన ఒకరిని నేరాల భారిన పడకుండా కాపాడుతుందని, న్యాయం పోరాడడానికి సహాయపడుతుందని అన్నారు. న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తుందని, అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వంశీక్రిష్ణ, జిల్లా న్యాయ సేవధికార సంస్థ డిప్యూటీ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, సభ్యులు కిరణ్ కుమార్, మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
                            