Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 22 : నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన విద్యార్థులు ఉన్నత లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలని ఇంటర్ మీడియట్ జిల్లా విద్యాధికారి (డీఐఈవో) సత్యవర్ధన్ రావు అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శశిధర్ శర్మ అధ్యక్షతన నూతనంగా చేరిన విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఐఈవో సత్యవర్ధన్ రావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రతీ విద్యార్థికి జీవితంలో ఎంతో కీలకమైందన్నారు. నూతన విద్యార్థులు కళాశాల వాతావరణానికి అలవాటు పడుతూ క్రమశిక్షణ, సమయపాలన పాటించి విద్యను అభ్యసించాలన్నారు. క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ అధ్యాపకుల బోధనను శ్రద్ధగా వినాలని సూచించారు.
చదువుతోపాటు విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రతిభ చాటాలన్నారు. ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యం కోసం కృషి చేస్తూ కళాశాల పేరును గుర్తింపును తీసుకురావాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాల కోసం లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం నూతన విద్యార్థులకు ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రెషర్స్ డే లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఉత్సాహపరిచాయి. అనంతరం ప్రిన్సిపల్ శశిధర్ శర్మ కళాశాలలో కల్పిస్తున్న సదుపాయాలు కళాశాల ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆకవరం భవాని, వివిధ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, మహేందర్ కుమార్, రాజేశ్వరరావు, జగన్ మోహన్ రెడ్డి, అధ్యాపకులు ఇల్లందుల సంపత్ కుమార్, జనార్ధన్, రవికుమార్, గోవర్ధన్, మహేందర్, చంద్రశేఖర్, కృష్ణమోహన్, అనిత, స్వరూప, మమత, కవిత, వాలీ పాషా, తిరుపతి విద్యార్థులు పాల్గొన్నారు.