వెల్గటూర్, సెప్టెంబర్ 10: ‘ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన గాడి తప్పింది. పల్లె, పట్టణాల్లో పారిశుధ్యం లోపించి ప్రజలు జ్వరాలతో అల్లాడిపోతున్నారని, దవాఖానల్లో వసతులు, మందులు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి కనీస పట్టింపులేకుండా పోయింది’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్, ఎండపల్లి మండలంలో ఇటీవల విష జ్వరాలతో పలువురు మృతిచెందగా, వారి కుటుంబాలను మంగళవారం పరామర్శించారు. వెల్గటూర్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరుగలేదని విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, ఎన్నికల ముందు వారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడూ గత ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా పాలన గాలికొదిలేశారని, ఫలితంగా గ్రామాల్లో పారిశుధ్యం లోపించి డెంగ్యూ, చికున్ గున్యా లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రం జ్వరాల కుప్పగా తయారైందని, గత ఏడెనిమిదేండ్లలో ఒక్క డెంగ్యూ కేసైనా నమోదైందా..? ఆలోచించాలని ప్రజలకు సూచించారు.
ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారని, ప్రభుత్వ దవాఖానలకు వెళితే వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వేలకు వేలు ఖర్చు చేస్తూ ప్రైవేట్ దవాఖానలకు వెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనీస పట్టింపులేకుండా పోయిందని, ఆయనకు ప్రతి పక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే నియోజకవర్గాల్లో సొంత పనులు చేసుకుంటున్నారని, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైద్యులు, అధికారులతో రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఒకప్పుడు ప్రసవాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రభుత్వ దవాఖానలు ఇప్పుడు డీలా పడిపోయాయని, నిర్వహణ లేక ప్రసవాల సంఖ్య 70 నుంచి 30 శాతానికి పడిపోయిందన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల జాడే లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ నాయకులు అడ్డం, పొడుగు మాట్లాడడం ఆపేయాలని, గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకొని ప్రజలకు భరోసాగా నిలవాలని సూచించారు. అనంతరం ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన సాన మారుతి, జయకర్, భీమవ్వ, వెల్గటూర్ మండలం స్థంభంపల్లికి చెందిన అవ్వ లింగయ్య, వెల్గటూర్‌కు చెందిన బుచ్చయ్య మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు చల్లూరి రాంచందర్‌గౌడ్, సింహాచలం జగన్, ప్రధాన కార్యదర్శి జుపాక కుమార్, నాయకులు ఏలేటి చంద్రరెడ్డి, మూగల సత్యం, గాజుల మల్లేశం, అనుమాల తిరుపతి, బందెల నర్సయ్య, పోడేటి రవి, పొన్నం తిరుపతి గౌడ్, కుషనపల్లి రవి, చుంచు మల్లేశ్, గాజుల భానేశ్, రామగిరి మల్లేశ్, మేర్గు అశోక్, జాన్ ఉన్నారు.