ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు ఛాయలు విలయతాండవం చేస్తుండగా.. అదేస్థాయిలో కరెంటు కోతలు పెరుగుతున్నాయి. వ్యవసాయం సాగు పెరగకపోయినా ఉమ్మడి జిల్లా ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయడంలో సర్కారు విఫలమవుతోంది. దీంతో రోజురోజుకూ కరెంటు కోతలు తీవ్రమవుతుండగా.. ఉన్న పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. సబ్స్టేషన్ల వద్ద ఆందోళన బాట పడుతున్నారు. మున్ముందు ఈ పరిస్థితి మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తుండగా.. ప్రత్యామ్నాయ ప్రణాళికలపై సర్కారు దృష్టిపెట్టడం లేదు. మరోవైపు ఉమ్మడి జిల్లాపై ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నా.. మంత్రులు కనీసం సమీక్షించడంపై చిత్తశుద్ధి చూపడం లేదు. ఫలితంగా ఉమ్మడి జిల్లా ప్రజలు ఇటు కరువు.. అటు కరెంటు కోతలతో అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
కరీంనగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటుచూసినా వివిధ రకాల పంటలతో సిరులు కురిపించిన ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఎటుచూసినా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. నాడు నిండుకుండలా ఉన్న ప్రాజెక్టులు నేడు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. నాటి ప్రభుత్వంలో నాలుగు రిజర్వాయర్లుగా మారిన వరదకాలువ నేడు వెలవెలబోతున్నది. గళగళ పారే ఎస్సారెస్సీ కాలువలు చుక్క నీరు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. చెరువులు అర్రులు చాసి చూస్తున్నాయి. నీటి లభ్యత తగ్గిపోవడంతో భూగర్భజాలు అడుగంటి పోయాయి.
ఫలితంగా ఉమ్మడి జిల్లాలో కరువు మేఘాలు ఇప్పటికే కమ్ముకొని అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. మచ్చుకు ఒక్క ఉదాహరణ చూస్తే వ్యవసాయ రంగంలో ప్రమాద ఘంటికలు ఎలా మోగుతున్నాయో అర్థమవుతోంది. కరీంనగర్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2.79 లక్షల ఎకరాల్లో వరి పంట వేస్తారని అంచనా ఉంటే ఇప్పటి వరకు కేవలం 54,003 ఎకరాల్లో మాత్రమే వేశారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు 42 వేల ఎకరాల్లో సాగుచేసినట్లు వ్యవసాయ అధికారులు లెక్కలు చూపుతున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో 3.16 లక్షల ఎకరాల్లో ్ల వరి వేస్తారని అంచనాలు తయారు చేస్తే ఇప్పటి వరకు కేవలం 11 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అలాగే, పెద్దపల్లి జిల్లాలో వరి 2.15 లక్షల ఎకరాల్లో అంచనా వేయగా 35 వేల ఎకరాల్లో మాత్రమే వేసినట్లు వ్యసాయ గణాంకాలు చెపుతున్నాయి. మిగిలిన పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ఎడాపెడా కరెంటు కోతలు
నిజానికి అంచనాలకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో 50 శాతం కూడా పంటలు వేయలేదు. అయినా, ఎడాపెడా కరెంటు కోతలు పెడుతుండడంతో వేసిన కొద్ది పాటి పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. నిజానికి అంచనాలకు అనుగుణంగా పంటలు వేయకపోవడం.. ముఖ్యంగా వరి లేకపోవడంతో కరెంటు కోతలు ఉండొద్దని నిపుణులు చెపుతున్నారు. వరి వేస్తే నిరంతరం మోటర్లు నడుపాల్సి ఉంటుంది.
తద్వారా.. విద్యుత్ వినియోగం పెరిగి డిమాండ్ పెరుగుతుంది. కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని పేర్కొంటున్నారు. అయినా, కరెంటు కోతలు పెడుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో ఏకంగా వరి సాగు చేసినా.. ఉమ్మడి జిల్లాలోని 4 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు నిరంతరం నడిచినా.. ఆనాడు కరెంటు కోతలు లేవు. 24 గంటల పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇచ్చారు. అంతేకాదు.. వ్యవసాయరంగానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి.. విజయవంతంగా సరఫరా చేసి అప్పటి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. కానీ, ప్రస్తుతం విద్యుత్ పంపిణీలో అడుగడుగునా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో కరెంటు కోతలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల అన్నదాతలు సబ్స్టేషన్ల ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయరంగానికి నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఉమ్మడి జిల్లాలో జూలై నెలలో రోజువారీ లెక్కలు చూస్తే 24,601 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే కేటాయింపులు మాత్రం 23.41 మిలియన్ యూనిట్లు ఉన్నాయి. అంటే కేటాయింపులకు, వినియోగానికి అంతరాయాన్ని చూస్తే.. రోజుకు 1.191 మిలియన్ యూనిట్ల సరఫరా లోటు కనిపిస్తోంది. ఇదే పరిస్థితి ఇలాగే ఉంటే.. మున్ముందు కరెంట్ కోతలు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.
మంత్రులెక్కడ?
నిజానికి ఉమ్మడి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిపి చూస్తే.. నలుగురు ఉన్నట్లు. ఎల్‌నినో ప్రభావం ఇప్పటికే ఉమ్మడి జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. భూగర్భజలాలు అడుగంటి పోయాయి. వ్యవసాయ అధికారులు అంచనా వేసిన పంటల్లో కనీసం 20 నుంచి 25 శాతం కూడా వేయలేని దుస్థితి ఉంది. అయితే.. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పడమే తప్ప.. ఏయే పంటలు ఏయే గ్రామాల్లో వేయాలన్న నిర్ధిష్ట ప్రణాళిక ఇప్పటి వరకు వెల్లడించలేదు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి?, ఆయా పంటలకు అనువైన నేలలు ఏంటి?, ఆ పంటలు వేస్తే రైతులకు వచ్చే ఇబ్బందులు ఏంటి?, లాభాలు ఎన్ని?, పంటలను తట్టుకోవడం ఎలా?, ప్రత్యామ్నాయ పంటలువేస్తే ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలు ఏంటి?, ఏ పంటలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారు?, ఆయా గ్రామాల్లో సూచించే పంటలకు అనుగుణంగా భూసార పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా? లేదా?, ఇప్పటికే ఎక్కడైనా పరీక్షలు నిర్వహించారా? లేదా?, ఇప్పటికే వేసిన పంటల పరిస్థితి ఏంటి?, కరెంటు కోతలు ఎందుకు ఏర్పడుతున్నాయి?, కోతలను నివారించి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి?, అధికారులు ఏం చేయాలి?, వంటి తదితర అంశాలపై లోతైన సమీక్ష చేయాల్సిన మంత్రులు ఇటువైపు తొంగి చూడడం లేదు. కనీసం సమీక్షలు నిర్వహించి అధికారులకు సూచనలు ఇవ్వడం లేదు. దీంతో.. ఎవరి దారి వారిదే అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా.. ప్రత్యామ్నాయ పంటలకు కావాల్సిన చర్యలు తీసుకోకుండా సర్కారు వహిస్తున్న నిర్లక్ష్యం వల్ల.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది.
రైతుల కన్నెర్ర

కోరుట్ల రూరల్, జూలై 18: రైతులు కన్నెర్రజేశారు. కోతల్లేకుండా నాణ్యమైన కరెంట్ అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం అయిలాపూర్ గ్రామంలో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఎన్నో ఆశలతో వరి, మక్క పంట వేశామని, విద్యుత్ సరఫరా సరిగా చేయకపోవడంతో నీరందక ఎండిపోతున్నాయని వాపోయారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24గంటల త్రిఫేస్ విద్యుత్ అందిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ రైతులను చిన్నచూపు చూస్తున్నదని, 10గంటలు కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నా, అందులోనూ తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయని మండిపడ్డారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగగా, పోలీసులు వచ్చి రైతులను సముదాయించి నిరసన విరమింపజేశారు. ఇక్కడ పిడుగు సందయ్య, దీకొండ రాజనర్సయ్య, శేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కరుణాకర్, రాజు, శ్రీనివాస్, నరేష్, రాజరెడ్డి, సంజీవ్, అశోక్, లింగారెడ్డి పాల్గొన్నారు.
