Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 1 : ధరలను అదుపు చేయలేని తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారానైనా ప్రజలకు నిత్యవసర సరుకులు అందించాలని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనందబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈదునూరి నర్సింగ్ డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో వారు శనివారం విలేకరులతో మాట్లాడారు. నవంబర్ నెల నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యంతోపాటు గోధుమలు, కందిపప్పు, చక్కెర, చింతపండు, నూనె, ఉప్పు, కారంపొడి తదితర నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేసి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించాలని కోరారు.
ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలు మధ్య తరగతి ప్రజలకు గుదిబండగా మారాయనీ, ధరలను నియంత్రించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తే ప్రజలకు ఒకింత భారం తగ్గుతుందన్నారు. కూలీ నాలి చేసుకొని జీవించే సామాన్య ప్రజలు మార్కెట్ కు వెళ్లి నిత్యవసర సరుకులు కొనలేని పరిస్థితి ఉందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు గారెడేలేనా అని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రామగుండంలోని వివిధ పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఉద్యోగాలు అమ్ముకోవడం కాదనీ, స్థానిక నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రజా సంక్షేమంను విస్మరిస్తూనే ఉందన్నారు.