బీఆర్ఎస్వీ గురుకుల బాటలో ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. విద్యార్థులు పడుతున్న అవస్థలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల పరిశీలనకు వెళ్లగా అనేక సమస్యలు స్వాగతం పలికాయి. కుళ్లిన గుడ్లు తినలేక.. సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. పలు చోట్ల అనుమతి పేరిట పాఠశాలల లోపలికి రాకుండా సిబ్బంది గేట్లు వేసి అడ్డుకోవడంపై నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. పరిశీలనకు వెళ్తే అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం ఏంటని నిలదీశారు.
సమస్యలపై నిలదీస్తాం
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మల్యాల, డిసెంబర్ 2 : గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు.సోమవారం ఆయన మల్యాల మండలంలోని తాటిపల్లి గురుకుల పాఠశాలను స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో విద్యార్థులతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. వంటగదిలోని పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ పాఠశాలలో విద్యార్థులకు స్నానం చేసేందుకు వేడి నీరు అందడం లేదని, డార్మెటరీ హాల్ సరిగా లేక ఒకరు పడుకునే స్థానంలో ఇద్దరు పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
కుళ్లిన కోడిగుడ్లను అందిస్తున్నారని, దుప్పట్లు లేక చలికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బాలికలకు కాస్మొటిక్ కిట్లు అందజేయడం లేదని విమర్శించారు. కోతుల బెడద సైతం ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓసారి తమ పరిధిలోని గురుకుల పాఠశాలను సందర్శించాలని హితవుపలికారు. ఆయన వెంట నాయకులు బంద అంజయ్‌కుమార్, జనగం శ్రీనివాస్, అయిల్నేని సాగర్‌రావు, తైదల శ్రీలత, చందు, అజహరోద్దీన్, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగం నిర్వీర్యం
జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
జగిత్యాల కలెక్టర్‌తో మాట్లాడుతున్న జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
జగిత్యాల, డిసెంబర్ 2 : కాంగ్రెస్ సర్కారు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. సోమవారం జగిత్యాలలోని ధరూర్ క్యాంపులో ఉన్న గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె సందర్శించారు. అకడున్న విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి సౌకర్యాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల నుంచి కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ వెళ్లి ‘ప్రజావాణి’లో సమస్యలను కలెక్టర్‌కు తెలియజేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే పరిష్కరించాలని డీఈవోను ఆదేశించారు. ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడుతూ, రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అత్యంత దయనీయం పరిస్థితిలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అరకొర నిధులు ఇస్తున్నదని, కనీసం నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉందని ధ్వజమెత్తారు. కాస్మొటిక్ చార్జీలు పెంచారంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారని, కానీ హాస్టళ్లలో కనీసం సబ్బులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం, చింత గంగాధర్, వెంకటేశ్వర్లు, గంగారెడ్డి, చిట్ల రమణ, ప్రణయ్, భగవాన్ మనోజ్, నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నిర్బంధ పాలన
గోదావరిఖని, డిసెంబర్ 2: రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన గోదావరిఖనిలోని మైనార్టీ పాఠశాలను సందర్శించారు. అయితే, బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారన్న సమాచారంతో పాఠశాల సిబ్బంది గేటు వేసి లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. అనుమతి లేనిదే లోనికి రావొద్దనడంతో అక్కడే వేచి ఉండి విరామ సమయంలో బయటకు వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, విలేకరులతో మాట్లాడారు. గురుకులాల బాటలో భాగంగా విద్యార్థుల స్థితిగతులను తెలుసుకునేందుకు వస్తే అధికారులు అనుమతి లేదని అంటున్నారని, పోలీసులతో అడ్డుకుంటున్నారని, ఇది దుర్మార్గపు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. నిర్బంధ పాలనకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గురుకుల పాఠశాలల్లో పిల్లలకు ఏ ఇబ్బందులు కలిగినా పాలకులు, ప్రిన్సిపాల్ వహించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేటర్ కల్వచెర్ల కృష్ణవేణి, నాయకులు అచ్చె వేణు, నారాయణదాసు మారుతి, చుక్క శ్రీనివాస్, సట్టు శ్రీనివాస్, బొడ్డు రవీందర్, జడ్సన్, ఇరుగురాళ్ల శ్రావణ్, కిరణ్, రామారాజు, ఆవునూరి వెంకటేశ్, చింటూ, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.