Collector Koya Sriharsha | కోల్ సిటీ, ఆగస్టు 30: రామగుండం నియోజక వర్గంలోని చిన్న, సన్నకారు రైతులందరికీ యూరియా అందుబాటులో ఉండేలా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో యూరియా లభ్యత, పంపిణీపై ఆయన రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల వ్యవసాయ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో గత ఏడాది కంటే ప్రస్తుతం యూరియా సరిపడా చేస్తున్నా రైతుల వద్ద కొరత ఉండటానికి గల కారణాలు పరిశీలించాలని సూచించారు. ప్రతీ గ్రామ పరిధిలో చిన్న, సన్నకారు రైతులందరికీ యూరియా తప్పనిసరిగా అందేలా వ్యవసాయ అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలన్నారు.
జిల్లాలోని పెద్ద రైతులు యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడాలని కలెక్టర్ సూచించారు. రైతుల అవసరాల మేరకు యూరియా అందుబాటులో ఉందని, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తూ జిల్లాకు అవసరమైన యూరియాను ఎప్పటికప్పుడు స్టాక్ తెప్పిస్తున్నామని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు.
రైతులు యూరియా స్టాక్ పెట్టుకోకుండా ప్రస్తుత అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయలనీ, ముందుగా స్టాక్ పెట్టుకోవడం వల్ల యూరియాలోని శక్తి తగ్గిపోయి పంట దిగుబడి తగ్గుతుందన్నారు. సమావేశంలో వ్యవసాయ అధికారులు బండి ప్రమోద్ కుమార్, కల్వల సతీశ్, కొప్పుల ప్రకాశ్ తోపాటు అధికారులు పాల్గొన్నారు.