సమైక్య పాలనలో ఏ ఆధారం లేక.. ప్రోత్సాహం కరువై సిరిసిల్ల వస్త్రపరిశ్రమ చిక్కిశల్యమైంది. సంక్షోభంలో చిక్కి ఉరితాళ్లు పేనింది. వందలాది మంది కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలతో ఆగమైన క్షేత్రం, స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకున్నది. మంత్రి కేటీఆర్ చొరవ, బీఆర్ఎస్ సర్కారు అండదండలతో పూర్వవైభవం సంతరించుకున్నది. రూ.లక్షలోపు రుణమాఫీ, చేనేతలక్ష్మి, చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నూలు రాయితీ, వర్కర్‌టూ ఓనర్ పథకం, 50 ఏండ్లకే పింఛన్ వంటి పథకాలు, అనేక ప్రోత్సాహాలకుతోడు ఏడేండ్లుగా ఏటా రూ.350 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లతో ‘సిరి’సిల్లగా అవతరించింది. నేతన్నకు చేతినిండా పని దొరుకుతుండడంతో వలసలు వాపస్ రాగా, అనతికాలంలో బడా కామ్గార్గా మారిపోయింది. ఇక్కడి కార్మికులే కాదు ఇతర రాష్ర్టాల వారికి ఉపాధి కేంద్రంగా మారగా, ఒక్కొక్కరికీ నెలకు రూ.25 వేల పైనే పగారా వస్తున్నది. డబ్బులకు డబ్బులు, ఏడాదంతా పనితో వేలాది మంది జీవితాలు నిలబడగా, కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో నేడు చేనేత దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం
– కరీంనగర్/రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్/రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నాటి పాలనలో చితికిపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు జీవం పోసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి సాంచాలకు పూర్వవైభవం తీసుకొచ్చింది. చేనేత జౌళీశాఖ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నేతన్నల జీవితానికి భరోసా దొరికింది. రూ.లక్షలోపు రుణమాఫీ, చేనేత లక్ష్మి, చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నూలు రాయితీ, వర్కర్‌టూ ఓనర్ పథకం, 50 ఏండ్లకే పింఛన్ వంటి పథకాలు, రైతు బీమా తరహాలో రూ.5లక్షల బీమా, 50ఏండ్లకే రూ.2016 పింఛన్ సాయంతో కార్మిక లోకం దీమాగా ఉన్నది. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరల తయారీ, స్కూల్ యూనిఫాంల ఆర్డర్‌ను సిరిసిల్లకే ఇస్తుండడంతో చేతి నిండా పని, పనికి తగ్గ కూలీ అందుకుంటూ దర్జాగా బతుకుతున్నది.
ఇదర్ కామ్ అచ్చాహై..
ఈ చిత్రంలో కనిపిస్తున్నది హైదర్. వయసు 48 ఏండ్లు. మరమగ్గాల కార్మికుడు. స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం. ఇరవై ఏండ్లు మహారాష్ట్రలోని భీవండీలో పనిచేసిండు. రోజుకు 12గంటలు సాంచాలు నడిపితే అప్త (15రోజులు)కు 7వేలు వచ్చేవి. సిరిసిల్లల బతుకుదెరువు మంచిగుందని ఆరునెలల క్రితం తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చిండు. పట్టణంలోని ప్రగతినగర్‌లోని ఓసామి కార్ఖానాలో బతుకమ్మ చీరలు తయారు చేస్తున్నడు. అప్త (ఇక్కడ వారం రోజులు)కు 7 వేలు కూలి ఎత్తుతున్నడు. మహారాష్ట్రతో పోలిస్తే 15 రోజులకు రెండింతల కూలితో నెలకు 28వేలు సంపాదిస్తున్నడు. ఇక్కడ వచ్చిన కూలి డబ్బుల్లో పొట్టకు పోనూ మిగిలినయి సొంతూరిలో ఉన్న భార్యకు పంపిస్తున్నడు. తనకున్న ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులను బాగా చదివిస్తున్నడు. “తెలంగాణ మే అచ్చా కామ్ హై. బతుకమ్మ సారె చలాయతో పగార్ బోద్ జాదా ఆరాయై. హమ్ పాంచ్ ఆద్మీ ఇదర్ ఆకే కామ్ కర్ రహాహై. సిరిసిల్లమే హమేశా కామ్ మిల్రాహహై. కేటీఆర్ సాబ్‌కు జిందగీ తమామ్ నహీబూల్తే’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు
నేతన్నకు రూ.5 లక్షల బీమా.. 50 ఏండ్లకే పింఛన్
దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం వస్త్ర పరిశ్రమనే. ఈ క్రమంలో ప్రభుత్వం రైతుల మాదిరి నేతకార్మికులకు సైతం రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించి కుటుంబాలకు భరోసా కల్పించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 వేల మందికి బీమా వర్తిస్తుండగా, ఇప్పటి వరకు అనారోగ్య కారణాలతో చనిపోయిన ముగ్గురు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల పరిహారం అందజేసింది. ఇక పన్నెండు గంటల పాటు మరనేతన్నలు నిల్చుండి, చేనేత కార్మికులు కూర్చుండి పనిచేస్తుంటారు. వీరంతా ఎప్పుడు అనార్యోగాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో వీరికి 50ఏండ్లకే ప్రభుత్వం ఆసరా పింఛను వర్తింప జేసింది. జిల్లాలో 3733 మందికి ప్రతినెలా రూ.2016 చొప్పున మొత్తం రూ.75కోట్ల 36లక్షలు పంపిణీ చేస్తున్నది.
త్రిఫ్ట్‌తో ఆర్థిక సాయం
చేనేత, మరనేతన్నలకు చేతినిండా పని, పనికి తగ్గ వేతనం నెలకు రూ.20వేలకు పైగా వచ్చేలా చేసింది. వచ్చిన కూలీ డబ్బులను వృథా చేయకుండా వాటిని బ్యాంకులో దాచుకునేందుకు పొదుపు (త్రిఫ్ట్) పథకాన్ని అమలు చేసింది. కార్మికుడు రూ.8వేలు బ్యాంకులో జమ చేస్తే, దానికి ప్రభుత్వం మరో రూ.8వేలు జమ చేస్తుంది. దీంతో మూడేళ్ల కాల పరిమితిలో ఒక్కో కార్మికుడు రూ.60వేల నుంచి రూ.లక్ష దాకా సాయం అందుకున్నారు. ఇప్పటి వరకు 7801 మంది కార్మికులకు రూ.10.20 కోట్ల సాయం అందించింది.
యారన్ సబ్సిడీ..
చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు జీవం పోసి, పూర్వవైభవం తెచ్చేందుకు పరిశ్రమలకు వినియోగించే నూలు, రంగులు, రసాయనాలపై ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తున్నది. అందులో బతుకమ్మ చీరలు తయారు చేసే కార్మికులకు నూలుపై వచ్చే పదిశాతం సబ్సిడీ కార్మికులకే వర్తించేలా చర్యలు తీసుకున్నది. యారన్ సబ్సిడి ప్రతి సంవత్సరం నేరుగా కార్మికుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 6153 మందికి రూ.10.2 కోట్లను చెల్లించింది.
నేతన్నకు రుణమాఫీ
నాడు ఉపాధి లేక, గత ప్రభుత్వాల ఆదరణ కార్మికులంతా మైక్రో ఫైనాన్స్‌ల ఉచ్చులో కూరుకుపోయారు. తీసుకున్న బాకీలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యమ సమయంలో వీరి బాధలు చూసిన కేసీఆర్, కార్మికుల సంక్షేమం కోసం రూ.50లక్షల నిధులు ఇచ్చి ఆదుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అయ్యాక కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేయించారు. రైతు మాదిరిగా నేతన్నకు రుణమాఫీ పథకాన్ని అమలు చేసి, రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసి రుణవిముక్తులన్ని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.16కోట్లు మాఫీ చేసింది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉన్న 32 సహకార సంఘాల్లో 3200 మంది పనిచేస్తుండగా, వీరందరికి సంబంధించి రూ.3 కోట్ల రుణాలను మాఫీ చేసింది. అందులో సిరిసిల్ల జిల్లాలో 1500 మంది ఉన్నారు. కార్మికుల రుణమాఫీ ప్రకటించకపోయినప్పటికీ వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచాలన్న ఉద్దేశంతో కేటీఆర్ చొరవ మేరకు రుణమాఫీ జరిగింది.
మహిళల ఉపాధికి పెద్దపీట
బీడీలు చుట్టి అనారోగ్యం పాలవుతున్న మహిళలు, యువతులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో అప్పారెల్ పార్కును ఏర్పాటు చేసింది. రెండో బైపాస్‌రోడ్డులో 65 ఎకరాల్లో రూ.174 కోట్లతో తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్టులో గోకుల్దాస్ ఇమేజ్ కంపెనీ గ్రీన్నిడిల్ పేరిట యూనిట్ నెలకొల్పింది. అందులో ప్రస్తుతం వెయ్యి మంది మహిళలు దుస్తుల తయారీతో నెలకు రూ.7500 వేతనం పొందుతున్నారు. ఇక్కడ తయారైన దుస్తులు ఇటీవలే న్యూయర్క్‌కు ఎగుమతి కాగా, సిరిసిల్ల నైపుణ్యం నలుదిశలా చేరింది. అయితే ఈ పార్కులో 10వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం కాగా, మరిన్ని కంపెనీలు తెచ్చేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో 19 సంఘాలు
కరీంనగర్ జిల్లాలో 19 చేనేత పారిశ్రామిక సహకార సంఘాలుండగా, ఇందులో 1,528 మంది సభ్యులున్నారు. సహకారేతర రంగంలో మరో 220 మంది ఉన్నారు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, వీణవంక, కోర్కల్, ఆముదాలపల్లి, ఊటూరు, పచ్చునూరు, మన్నేంపల్లి తదితర గ్రామాల్లో సంఘాలు నిర్వహిస్తున్నారు. త్రిఫ్ట్ పథకం కింద 2021 అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు 1,581 మందికి వారి వ్యక్తి గత ఖాతాల్లో రూ. 5.69 కోట్లు జమ చేసింది. చేనేత మిత్ర రాయితీ కింద ఇప్పటి వరకు రూ. 7.50 కోట్ల రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.2023-24 ఆర్థిక సంవత్సరంలో 19 సంఘాలకు కేడీసీసీబీ ద్వారా ఇప్పటికే రూ. 3.63 కోట్ల రుణాలను అందించారు. అధునాతన పెడల్ మగ్గాల పథకం కింద జిల్లాలోని 8 చేనేత సహకార సంఘాలకు రూ. 90 లక్షలు మంజూరు చేసి 200 అధునాతన పెడల్ మగ్గాలు సరఫరా చేశారు.
నేతన్న బీమా పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 2,629 మంది నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు చేనేత పారిశ్రామికులు మరణించగా, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం సాయాన్ని అందించింది.
ప్రపంచంలోనే తొలి వర్కర్ టూ ఓనర్ పథకం
దున్నే వాడిదే భూమి అన్న నినాదం కాగితాలకే పరిమితం కాగా, వర్కరే ఓనర్ కావాలన్న లక్ష్యం కేసీఆర్ ప్రభుత్వానిది. ఎన్ని నిధులు వెచ్చించినా? ఎన్ని పథకాలు అమలు చేసినా? కార్మికుడికి చేరడం లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వర్కర్‌టూ ఓనర్పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పారెల్ పార్కులో సుమారు 1100 షెడ్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రతి కార్మికుడికి సబ్సిడీపై నాలుగు సాంచాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 1100 మందిని ఎంపిక చేశారు.
ప్రత్యేకంగా కార్పొరేషన్లు..
సమైక్య ప్రభుత్వం చేనేత రంగాన్ని మాత్రమే గుర్తించి బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించేది. వారి ప్రాంతంలో చేనేత కార్మికులే ఎక్కువగా ఉండడంతో సింహభాగం నిధులను ఆంధ్రాకే ఖర్చుపెట్టుకునేది. అదే మన వద్ద అత్యధిక శాతం మరమగ్గాలుంటాయి. దీంతో ఇక్కడి కార్మికులు ఆగమయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ అన్యాయాన్ని గుర్తించింది. చేనేత, మరమగ్గాలకు వేరువేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఏటా బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయిస్తూ, భరోసా ఇస్తున్నది.
భరోసా నింపిన చేనేతలక్ష్మి
చేనేత కార్మికులకు చేతినిండా పనికల్పించేందుకు బీఆర్ఎస్ సర్కారు ‘చేనేత లక్ష్మి’ పథకాన్ని అమలు చేసింది. చేనేత మగ్గాలపై తయారైన వస్ర్తాల కొనుగోలులో 50 శాతం డిస్కౌంట్ అందించింది. ఈ స్కీంలో చేరిన లబ్ధిదారుడు నెలకు రూ.500, రూ.1000,రూ.1500 దాకా ఐదు నెలల పాటు చెల్లించాలి. ఇలా నాలుగు నెలలు లబ్ధిదారుడు చెల్లిస్తే ఐదో నెలలో టెస్కో సంస్థ లబ్ధిదారుడి పేరిట సగం డబ్బులు జమ చేస్తుంది. టెస్కో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లలో వస్ర్తాలు కొనుగోలు చేసి డిస్కౌంట్ పొందవచ్చు. జిల్లా, డివిజన్ కార్యాలయాలలో వస్త్ర దుకాణాలను ఏర్పాటు చేయించారు. అలాగే చేనేత లక్ష్మి పథకంలో భాగంగా ప్రతి సోమవారం ప్రజాప్రతినిధులు, అధికారులంతా చేనేత వస్ర్తాలు దరించాలంటూ మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడం నేతన్నలకు మరింత కలిసివచ్చింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 80వేల మందికి చేతి నిండా పని దొరికింది. చేనేత సహకార సంఘాలు రాష్ట్రంలో 350 వరకు ఉండగా, 80వేల మంది పనిచేస్తున్నారు. కండెలు చుట్టే మహిళా కార్మికులు 15వేల మంది ఉన్నారు.
బతుకునిచ్చిన బతుకమ్మ
నాడు వస్త్ర పరిశ్రమను నడిపించలేక యజమానులు చేతులెత్తేశారు. ఉత్పత్తి చేసిన వస్ర్తాలకు సరైన మార్కెట్ సౌకర్యం లేక దివాళా తీశారు. ఖరీదైన వందలాది సాంచాలు తుప్పు కింద అమ్ముకున్నారు. ఉపాధి కోల్పోయిన మరనేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్న కార్మికులను ఎవరూ ఆదుకోలేదు. ఈ క్రమంలోనే స్వరాష్ట్రంలో చేనేత జౌళీశాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించడం పరిశ్రమకు బాగా కలిసి వచ్చింది. ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి చీరల పంపిణీకి అయ్యే ఆర్డర్లు సిరిసిల్లకే ఇప్పించారు. 2017లో ప్రారంభించిన ఈ స్కీం వల్ల ఇప్పటి వరకు ఏడు సార్లు రూ.2450కోట్ల ఆర్డర్ల ప్రభుత్వం ఇచ్చింది. ఇవే కాకుండా క్రిస్మస్, రంజాన్, కేసీఆర్కిట్లు, యూనిఫాంల తయారీకి సంబంధించి రూ.950 కోట్ల ఆర్డర్లు ఇచ్చి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది.