Ramagundam Municipality | కోల్ సిటీ, డిసెంబర్ 12 : రామగుండం నగర పాలక సంస్థలో ఆసక్తి ఉన్న మహిళలకు ఉపాధి కల్పిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులు, మెప్మా ఆర్పీలు, అమృత్ మిత్రలతో సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. అమృత్ మిత్రల సేవలను వార్డు అధికారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వశక్తి మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా చేయూత అందించడమే అమృత్ మిత్ర ఉద్దేశమన్నారు. ఈ ప్రాజెక్టులో పని చేయడానికి ఆసక్తి ఉన్న మహిళలకు అవకాశం కల్పించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
కార్పొరేషన్‌కు మంజూరైన రూ.1.08 కోట్లతో అమృత్ మిత్రల సహకారంతో వివిధ పనులు చేపట్టినట్లు వివరించారు. నాన్ టెక్నికల్ పనులతో పాటు టెక్నికల్ పనులు కూడా ఉన్నాయన్నారు. సాంకేతిక అంశాలలో స్వశక్తి మహిళలకు నాక్ ద్వారా శిక్షణ ఇప్పించి వారి సేవలను ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నల్లా బిల్లుల వసూలు, మొక్కలు నాటి సంరక్షించడం, నీటి శుద్ధత పరీక్షించడం, ఉద్యానవనాలు, వాటర్ ట్యాంకుల ఆవరణ శుభ్రం చేయడం, పట్టణ ప్రకృతి వనాల నిర్వహణ, తోటమాలి తదితర పనుల్లో మహిళల సేవలను ఉపయోగించుకుంటామన్నారు. పని చేసిన గంటల ఆధారంగా బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, సెక్రటరీ ఉమా మహేశ్వర్ రావు, డీఈ షాబాజ్, ఏఈ తేజస్విని, మెప్మా డీఎంసీ మౌనిక, సీఓ ఊర్మిళ, శ్వేత, శమంత తదితరులు పాల్గొన్నారు.