Gangadhara | గంగాధర, ఏప్రిల్ 17 : రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయని, న్యాయబద్దమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవడం లేదు, ప్రభుత్వం ఫన్నీటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పిలుపు మేరకు శుక్రవారం కరీంనగర్ జిల్లా గంగాధర తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ రజతకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలను వివిధ రూపాల్లో సీఎస్, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని పేర్కొన్నారు. జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు పరచాలని, విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డ్స్ తక్షణమే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలని కోరారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిట గంగాధర మండల నాయకులు బోయిని శ్రీకాంత్, చంద్రారెడ్డి, మల్లేశ్, రోహిణి, సతీష్, కిషన్, మమత తదితరులు పాల్గొన్నారు.