KORUTLA | కోరుట్ల, జనవరి 3: ఆర్టీసీ సంస్థకు ఉద్యోగులే ప్రగతి చక్రాలని, సంస్థ పురోభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలని ఆర్టీసీ జిల్లా రీజినల్ మేనేజర్ రాజు అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో శనివారం సమ్మక్క సారక్క జాతరకు ఆర్టీసీ అందిస్తున్న బస్సు సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం సమ్మక్క, సారక్క జాతరలో విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలన్నారు. ఉద్యోగులకు సంస్థ కేటాయించిన విధులను సమర్ధవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు.
ప్రయాణీకులతో స్నేహపూర్వకంగా మెలగాలని, బస్సు సర్వీస్ వేళలను ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు వివరించాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. అనంతరం జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్ గా అవార్డు పొందిన యూసూఫ్ ను ఆర్ఎం సత్కరించారు. రీజినల్ స్థాయిలోని 11 డిపోల్లో అత్యధికంగా శబరిమల యాత్రకు ఐదు బస్సులను బుకింగ్ చేయడానికి కృషి చేసిన ఆర్టీసీ ఉద్యోగులు రమేష్, లక్ష్మీ నారాయణలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో డిపో మేనేజర్ మనోహర్, ట్రాఫిక్ సూపరిండెంట్ లక్ష్మయ్య, అసిస్టెంట్ మెకానికల్ ఫోర్ మెన్ షాధిక్ అలీ, ఆఫీస్ సూపరిండెంట్ గంగారాం, డిప్యూటీ సూపరిండెంట్ ఫైనాన్స్ బాబు, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ సాగర్, ఉద్యోగులు పాల్గొన్నారు.