‘ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టున్నది ప్రభుత్వోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) తీరు! ఇప్పటి వరకు హెల్త్‌కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ కాలేదు.. హాస్పిటళ్లతో చర్చల్లేవు.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఇంకా తమ ఐచ్ఛికాలు నమోదు చేసుకోలేదు.. కానీ, మే నెల జీతం నుంచి ప్రతి ఉద్యోగి బేసిక్ వేతనంపై 1.5 శాతం డబ్బులను కోత పెట్టడంపై తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలో హెల్త్‌కార్డుల పథకాన్ని అమల్లోకి తేకముందే జీతాల నుంచి మినహాయించడం సరికాదని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు, నాయకులు మండిపడుతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత అని, ఇలా ఏకపక్షంగా కట్ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమం పేరిట అదనపు ఆర్థిక భారం మోపవద్దని సూచిస్తున్నారు.
కరీంనగర్,మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కరీంనగర్ కలెక్టరేట్ : ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమల్లోకి తెస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొన్ని సంఘాలు, కొంత మంది ఉద్యోగుల మాటలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా.. విస్తృత చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి.
కానీ, ఇవేవి పట్టించుకోని సర్కారు ఏకంగా మే నెల వేతనం నుంచి కోతలు పెట్టింది. నిజానికి ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు అందలేదు. ఏ దవాఖానల్లో చికిత్సలు అందిస్తారో చెప్పలలేదు. స్పష్టమైన విధి విధానాలు ఏమిటో ఇంకా వెల్లడించలేదు. నమోదు ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. మెజార్టీ జిల్లాల్లో 20 నుంచి 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఇప్పటివరకు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. చాలా మంది ఉద్యోగులు పథకంలో చేరాలా.. వద్దా? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉదాహరణకు చూస్తే.. కరీంనగర్ జిల్లాలో 9,400 పైచిలుకు ఉద్యోగులకు ఇప్పటివరకు 2,500 వరకు మాత్రమే వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే ఈ పథకం అమలుపై ఉద్యోగుల్లో అనేక సందేహాలు ఉన్నాయి.
నగదు రహిత వైద్యం ఎలా అందుతుంది? అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సదుపాయాలుంటాయి? హెల్త్‌కార్డులు ఎప్పటిలోపు జారీ అవుతాయి? వంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలోనే ఉద్యోగుల వేతనాల నుంచి 1.5 శాతం చొప్పున నిధులు మినహాయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముందుగా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి, అనంతరం ఉద్యోగుల నుంచి వాటా వసూలు చేయాల్సింది పోయి.. ప్రయోజనాలు అందకముందే జీతాల్లో కోతలు పెట్టడం ఏ మేరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఇద్దరి వేతనాల్లో నుంచి విడివిడిగా కోత పెట్టడంపై మండిపడుతున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు ఒకే హెల్త్ బెనిఫిట్‌ను పొందుతుంటే, ఇద్దరి జీతాల నుంచి పూర్తిస్థాయిలో వాటా మినహాయించడం అన్యాయమని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహిస్తున్నారు. సంక్షేమం పేరిట ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం మోపడమేనని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ సూచనలతో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అంశాల్లో పారదర్శకత, సంప్రదింపులు, స్పష్టత అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తున్నారు.
హెల్త్‌కార్డుల అమలుకు ముందు పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయడం, ఉద్యోగుల సందేహాలు నివృత్తి చేయడం, కోతలపై స్పష్టత ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. లేకపోతే ఇప్పటికే పెండింగ్ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు మరింత ఆగ్రహించి, ఉద్యమబాట అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నమ్మకం నిలబెట్టుకోవాలంటే ముందుగా పథకంపై స్పష్టత ఇచ్చి ప్రారంభించిన అనంతరమే వాటా వసూలు విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు విషయంలో అత్యుత్సాహం చూపిన సర్కారు పెండింగ్‌లో ఉన్న డీఏల గురించి ఎందుకు అలోచించడం లేదని, అలాగే వేతన సవరణ ఒప్పందం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
డబ్బులు గుంజడం ఏ చట్టంలో ఉన్నది?
ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న అధికారుల తుగ్లక్ చర్యగా భావిస్తున్నాం. వెంటనే సీఎం జోక్యం చేసుకోకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి ఆగ్రహం తప్పదు. హెల్త్ కార్డులకు సంబంధించిన విధివిధానాలు లేవు. కార్పొరేట్ హాస్పిటల్స్‌తో కనీస చర్చలు లేవు. అసలు కార్డ్సు జారీ ప్రక్రియే ప్రారంభం కాలేదు. కానీ, మే నెల వేతనం నుంచి 1.5 శాతం మొత్తాన్ని ఏకపక్షంగా మినహాయింపు చేశారు. ఇంతకంటే తుగ్లక్ పని ఉంటుందా? పైగా, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే.. ఇద్దరి వేతనాల నుంచి కట్ చేయడం అధికారుల బరితెగింపునకు పరాకాష్ట. సదుపాయం కల్పించకుండానే ముందస్తుగా డబ్బులు గుంజడం ఏ చట్టంలో ఉన్నది?
ఇది అధికారుల స్వీయ పైత్యమా..? లేక ప్రభుత్వం వెనుక నుంచి నడిపిస్తున్న గుప్త ఎజెండానా..? ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఈహెచ్ఎస్ వెనుక జరుగుతున్న ఈ నిలువు దోపిడీపై, అధికారుల నిర్వాకంపై పూర్తిస్థాయి సమీక్ష జరపాలి. తక్షణమే లోపాలను సవరించాలి. చేతిలో అధికారం ఉందని ఉద్యోగుల జేబులకు చిల్లులు పెడితే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరువకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆగ్రహానికి, తిరుగుబాటుకు గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం,
– మానేటి ప్రతాప్‌రెడ్డి, రిటైర్డ్ హెడ్మాస్టర్
చర్చల తర్వాతే నిర్ణయం తీసుకోవాలి
ఆరోగ్య కార్డుల మార్గదర్శకాలు జారీ కాలేదు. దవాఖానలతో చర్చలూ లేవు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అయినా మే నెల జీతం నుంచి డబ్బులు ఎలా మినహాయిస్తారు? మరి ఇంతే వేగంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన 5 డీఏలను ఎందుకు చెల్లించడం లేదు? సుమారు మూడేళ్ల నుంచి నూతన వేతన సవరణ ఎందుకు చేయడం లేదు. ఈ విషయాలపై ముందుగా సర్కారు సమాధానం చెప్పాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రభుత్వ దోపిడీని గుర్తు పట్టలేనంత అమాయకులు కాదు.
కొన్ని భజన సంఘాలను మాత్రమే కాదు, అన్ని సంఘాలను పిలవాలి. వెంటనే సమావేశాలు నిర్వహించి హెల్త్ కార్డుపై చర్చించిన తర్వాతే నిర్ణయించాలి. ఈ పథకంలో చేరాలా.. లేదా? అనే ఆప్షన్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇవ్వాలి. ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. భజన సంఘాలతో సమావేశాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో ఆక్రోశం, అసంతృప్తి పెరిగిపోయింది. ముఖ్యమంత్రి వెంటనే ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. చర్చల తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. హెల్త్‌కార్డు పక్కకు పెట్టి ముందు ఐదు డీఏలు, వేతన సవరణపై తేల్చాలి. హెల్త్ కార్డుల పేరిట మినహాయించిన డబ్బులను వెంటనే ఖాతాలకు జమ చేయాలి.
– చందూరి రాజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ స్టేట్ టీచర్ యూనియన్
ఇది చట్టవిరుద్ధం
ఈహెచ్ఎస్పై తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా మే నెల జీతాల నుంచి ప్రీమియం కట్ చేయడం చట్ట విరుద్ధం. తక్షణమే ఆ అమౌంట్‌ను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి. ఉద్యోగుల నుంచి చందా వసూలు చేసే విధానాన్ని మేం అంగీకరించేది లేదు. సర్వీస్ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఆరోగ్య రక్షణ కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత. దానిని పాటించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం తక్షణమే మే నెల జీతాల నుంచి మినహాయిచిన చందాను తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి.
– మహ్మద్ ఖలీలొద్దీన్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
హెల్త్ కార్డు ఇవ్వకుండానే కట్ చేస్తారా..?
ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వకుండానే ప్రీమియం కట్ చేస్తారా..? ఇది అత్యంత పాషవిక చర్య. జీతం నుంచి మినహాయించిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. ఆరోగ్య కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు, హాస్పిటళ్ల అంగీకారం, ఎన్ని వ్యాధులకు చికిత్స అందిస్తారో, ఎంత వరకు సీలింగ్ ఉంటుందో అనే విషయాలపై స్పష్టత లేకుండా కోత విధించడం సమంజసం కాదు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భార్యాభర్తలు ఉద్యోగులు అయితే ఇద్దరిలో ఎవరు ఆరోగ్య కార్డులకు దరఖాస్తు చేసుకోవాలో అనే విషయం పై స్పష్టత లేదు. అయినా ఇద్దరి జీతాల నుంచి 1.5 శాతం మినహాయించడం సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు విడుదల చేయాలి.
– జక్కోజు వెంకటేశ్వర్లు, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్