Electricity employees | ముకరంపుర, జూలై 9: కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఉద్యోగులు విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. సర్కిల్ కార్యాలయంతో పాటు డివిజన్, ట్రాన్స్ కో కార్యాలయాల్లో విద్యుత్ ఉద్యోగులంతా ఒక్క చోటికి చేరి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు తమ హక్కులు కాపాడుకోవడం కోసం సమ్మె చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ సంస్థలు ప్రైవేట్ పరమైతే బడుగు బలహీన వర్గాలు, చిన్న రైతులు, వాణిజ్య, చిన్న పరిశ్రమలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసన సమ్మెగా మారు తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎన్ అంజయ్య, సీహెచ్ భాస్కర్, కే శ్రీనివాస్, సంపత్ కుమార్, ఎం రమేష్, కిరణ్ కుమార్, జీ శ్రీనివాస్, సంతోష్, వీరయ్య, శ్యామయ్య రఘు, శ్రీనివాస్, కె రాజు, షరీఫ్, మల్లేశం, సంపత్, మోయిన్ పాషా, శ్రీమతి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.