Electric wires | చందుర్తి, జూన్19 : చందుర్తి మండలం లోని పలు గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. చేయి పైకెత్తితే తగిలేంత ఎత్తులో తీగలు ఉండగా ప్రమాదం అంచుని రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. అయినా విద్యుత్ అధికారులు వాటిని సరి చేయడం లేదు. తీగలు సరిచేయాలని స్థానికంగా ఉండే సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. చందుర్తి మండలం మల్యాల గుండ్లపల్లి కి చెందిన రైతు పడిగేల కొండయ్య వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి.
కొన్నిచోట్ల చేయి ఎత్తకపోయినా మనిషి తలకు తగిలే విధంగా మారాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమవాల్సిన రైతులు విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు. ప్రాణ నష్టం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించాలని పలువురు రైతులు కోరుకుంటున్నారు. వేలాడుతున్న తీగలను సరిచేయాలని వేడుకుంటున్నారు.
కరెంటోళ్లకు చెప్పినా.. సరి చేయడం లేదు : పడిగేల కొండయ్య, రైతు (మల్యాల)
మల్యాల గ్రామం గుండ్లపల్లి జగన్నాధుల ఆలయ శివారులో నాకు వ్యవసాయ పొలం ఉంది. అందులో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. వాటి కింద నుంచి వెళితే తలకు తగిలేంత కిందకు ఉన్నాయి. పొలంలో పనిచేసే సమయంలో భయం వేస్తోంది. కరెంటు తీగలు సరిచేయాలని స్థానికంగా ఉండే సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా సరి చేయడం లేదు. అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే వెంటనే తీగలు సరి చేయాలి.