Collector Koya Sri Harsha | పెద్దపల్లి, డిసెంబర్8 : ఎన్నికల విధులు రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం సాధారణ ఎన్నికల పరిశీలకుడు అనుగు నరసింహారెడ్డి తో కలిసి కలెక్టర్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9న రెండో విడత, 12న మూడో విడత ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్గించాలని, ఆ సమయంలో రిటర్నింగ్ అధికారులు ఎంపీడీవో కార్యాలయం వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మొదటి విడతలో పోస్టల్ బ్యాలెట్ 68 వరకు వచ్చాయని వెల్లడించారు.
ప్రతీ ఓటు కీలకమే..
ఎలక్షన్ రోజు కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం అవుతుందని, కౌంటింగ్ నిదానంగా జాగ్రత్తగా చేయాలని తొందర పడాల్సిన అవసరం లేదని, ప్రతీ ఓటు చాలా కీలకమైన అంశం గుర్తుంచుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎంపిక పూర్తి అయి, ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ సామగ్రి డిపాజిట్ చేసే వరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పూర్తి బాధ్యతగా ఉండాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీర బుచ్చయ్య, డీఈవో శారద, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.