కార్పొరేషన్, అక్టోబర్ 1: సాధారణంగా శిశువు జన్మించిన కొద్దిరోజులకు నామకరణం చేసిన తర్వాత బర్త్ సర్టిఫికెట్ తీసుకుంటారు! లేదంటే ఆరు నెలలకో.. ఏడాదికో దరఖాస్తు చేసుకుంటారు! మర్చిపోయిన వారు పిల్లల విద్యాభ్యాసం, లేదంటే విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్టు నిమిత్తం కావాలని తిరుగుతుంటారు! కానీ, కరీంనగర్ జిల్లాలో ఇటీవలి కాలంలో 60 ఏండ్లకుపై బడిన వృద్ధులు జనన ధ్రువీకరణ పత్రం కోసం బల్దియా మెట్లెక్కుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో మంది అర్జీలు సమర్పిస్తుండగా, ఈ వయస్సులో ఎందుకనే ప్రశ్న తలెత్తుతున్నది. అనేక అనుమానాలకు తావిస్తున్నది. బిహార్లో ఓటరు జాబితా సవరణ, అస్సాం రాష్ట్రంలో ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్స్ ఆఫ్ సిటీజన్స్) కోసం ఈ పత్రాలు అడుగుతున్న నేపథ్యంలో ఇక్కడా ముందస్తుగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నది.
కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ర్టాల్లో చేపడుతున్న చర్యల వల్ల జనన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయని తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో అస్సాం తదితర రాష్ర్టాల్లో ఎన్ఆర్సీ (ఇది ఒక పౌర రిజిస్టర్. ఇది రాష్ట్రంలో నివసించే వ్యక్తుల భారత పౌరసత్వాన్ని నిర్ధారించడానికి ఉద్దేశించబడింది.) పేరిట చేపట్టిన కార్యక్రమాలతో జనన ధృవీకరణ పత్రాలు అవసరం వస్తున్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగానే సాగింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బీహార్లో చేపట్టిన ఓటర్ లిస్టు సవరణ కార్యక్రమంలో బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్న వార్తలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో కరీంనగర్లో 60 ఏండ్ల పై బడిన వృద్ధులు దరఖాస్తు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి నెలా నగరపాలక సంస్థకు వంద మందికిపైనే అర్జీలు సమర్పిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సంబంధిత రికార్డులు ఉన్న వారికి మాత్రమే అధికారులు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుండగా, లేనివారికి రికార్డుల్లో లేవని పేర్కొని సమాచారం ఇస్తున్నారు. బల్దియా ద్వారా బర్త్ సర్టిఫికెట్ జారీ కాకపోతే రెవెన్యూ తీసుకునే అవకాశం ఉండడంతో అక్కడికి పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలకు వెళ్లేందుకు పాస్పోస్టు కావాల్సినా వారు ఇతర పత్రాలు లేకపోతే వీటి కోసం దరఖాస్తు చేయడం సాధారణం కాగా, ఇటీవల కాలంలో అందరూ 60 ఏండ్ల పైబడిన వారే దరఖాస్తు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతున్నది.