Accident | ధర్మారం, జులై 7: డ్రైవర్ అతివేగానికి ఓ వృద్ధుడి నిండు ప్రాణం బలైపోయింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కరీంనగర్ -రాయపట్నం రహదారిపై చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి తండ్రి మేడవేని చిన్నయ్య (68) సోమవారం మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకోవడానికి తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు.
అతడు ఎడమ వైపు నుంచి కుడి వైపు ఉన్న పెట్రోల్ బంక్ వైపునకు వెళ్తున్న క్రమంలో డ్రైవర్ అతివేగంగా జాగ్రత్తగా నడుపుతూ వస్తున్న బొలెరో వాహనంతో చిన్నయ్యను వేగంగా ఢీకొట్టాడు. అంతేకాకుండా కొంత దూరం ఆ ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఈడ్చి కెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నయ్య తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు.
ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లడం వల్ల ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. దీంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో వాహనం డ్రైవర్ భయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై లక్ష్మణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు. చిన్నయ్య మృతితో ధర్మారం మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది.