Dharmaram | ధర్మారం, జూన్ 6 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు ప్రహరీ గోడకూలి అదే గ్రామానికి చెందిన బొబ్బిలి పోశాలు (65) మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం.. పోశాలు తన ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడ వద్ద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బలహీనంగా ఉన్న ప్రహరీ గోడ అకస్మాత్తుగా కూలడంతో సదరు వృద్ధుడు దాని పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. దీంతో గోడ సిమెంట్ ఇటుకలు పోశాలుపై పడడంతో అక్కడికక్కడే మరణించాడు. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పోశాలు మరణించిన విషయం బయటకు తెలియలేదు.
ఉపాధి కూలీ పనులకు వెళ్లి వచ్చిన భార్య నర్సవ్వ ఇంటిలో భర్త కనిపించకపోవడంతో ఆమె ఆందోళన గురైంది. దీంతో ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడ పడిపోయి ఉండడం డ్రైనేజీలో పోశాలు కాళ్లు బయటకి కనిపించడంతో అతడు మరణించినట్లు భార్య గమనించింది. దీంతో అప్పటికే సదరు వృద్ధుడు మరణించడంతో చుట్టుపక్కల వారు వచ్చి పైన పడిన సిమెంటు ఇటుకలు తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం తెలుసుకున్న ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు. కాగా పోశాలు మృతితో గ్రామంలో విషాదం ఏర్పడగా అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు కాగా వారిలో ఇద్దరికీ వివాహాలు జరిగాయి.