EGS Gram Sabhas | చిగురుమామిడి, అక్టోబర్ 25: గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభలు శనివారం మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, ఉల్లంపల్లి, నవాబుపేట గ్రామాల్లో చివరి రోజున గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలకు ఎంపీడీవో విజయకుమార్, ఎంపీవో బత్తిని కిరణ్ కుమార్, ఇంచార్జ్ ఏపీవో రాజు హాజరై గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఈజీఎస్ గ్రామ సభలు నిర్వహించి పనులను గుర్తించారు.
17 గ్రామాలకు గాను 36 పనులను గుర్తించడం జరిగిందన్నారు. 7,400 మందికి కూలీలకు ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. ఎక్కువగా 48 దరఖాస్తులను పశువుల పాకలు, గొర్ల పెంపకానికి గ్రామస్తులు ఆసక్తి చూపడం జరిగిందన్నారు. ఈజీఎస్ లో పూటికతీత పనులు గత సంవత్సరం ఉండేవని, ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా ఉండటం వల్ల పనులు కల్పించలేకపోతున్నామన్నారు. 2026- 27 సంవత్సరాలకు గాను పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామ సభలలో పంచాయతీ కార్యదర్శులు సుమంత్, జ్యోతి, స్వప్న, స్వర్ణలత టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.