కరీంనగర్, (నమస్తే తెలంగాణ) ఏప్రిల్ 7 : రోడ్డుపై ఊడిపోయిన నీటి పైపు వద్ద కనిపిస్తున్న ఈ రైతు పేరు జెల్ల కుమార్. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లికి చెందిన ఆయన, సొంత ఎకరం భూమితోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి వేశాడు. కౌలుకు తీసుకున్న బావి అడుగంటింది. దాంతో తన అన్నతో పొత్తున్న మరో బావి నుంచి కౌలు భూమిలో వేసిన పంటకు నీళ్లు పెట్టేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు.
గాగిరెడ్డిపల్లి నుంచి సుందరగిరి వెళ్లే రోడ్డుకు ఒక వైపు సొంత పొలం, మరో వైపు కౌలు పొలం ఉండగా, వాహనాలు వెళ్లినపుడల్లా పైపులు ఊడి పోతున్నాయి. పైపు సరి చేసేలోపే బావిలో నీళ్లు అడుగంటుతున్నాయి. ప్రతి రోజూ ఇదే పరిస్థితి! కుమారే కాదు, ఇదే గ్రామంలో మరికొందరు రైతులు నీళ్లున్న బావుల రైతుల నుంచి కొనుగోలు చేసుకొని పంటలను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నారు. పొంటెకో రైతు చొప్పున నీళ్లు పెట్టుకుని పొలాలు పారించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా, ఒక పక్క తడుపుతుంటే మరో పక్క ఎండిపోతుండడంతో కంటతడి పెడుతున్నారు. కుమార్లాగే చాలా మంది రైతులు అదనంగా పైపులు తెచ్చుకొని మడిమడికీ సాపుకొని పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. గౌరవెల్లి నుంచి వచ్చే డీ-4 ప్రధాన కాలువ, దాని ఉప కాలువలు పూర్తయితేనే తమ సాగునీటి కష్టాలు తొలగుతాయని ఈ ప్రాంత రైతులు స్పష్టం చేస్తున్నారు. పోయిన యాసంగి నుంచి తీవ్రమైన సాగునీటి సమస్యకు అప్పుడే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు.