Mancharami village | సుల్తానాబాద్ రూరల్ జూన్ 23 : మూతపడ్డ సర్కారు బడిని తెరిపించేందుకు గాను రెండో రోజు మంచరామి గ్రామాన్ని మండల విద్యాశాఖ అధికారులు సోమవారం సందర్శించారు. మూతబడిన సర్కార్ బడిని తెరిపించాలని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. అందులో భాగంగా ఆదివారం సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య గ్రామాన్ని సందర్శించి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు.
అందరితో కలిసి మాట్లాడేందుకు సమావేశం నిర్వహించుకునేందుకు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలో మూతబడిన సర్కారు బడి ఆవరణలో సోమవారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామస్తులు గ్రామపంచాయతీ, పిల్లల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, సీఏలు, మహిళా సంఘ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు, గ్రామంలోని వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంఈఓ రాజయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపిస్తే రేపే పాఠశాలను ప్రారంభిస్తామని, 15 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు, 15 మంది కంటే తక్కువ ఉంటే ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తామని వెల్లడించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో అమ్మ ఆదర్శ కమిటీని ఎన్నుకొని వాళ్లతో పాఠశాలను మరమ్మతులు చేయించడం జరుగుతుందన్నారు. తప్పనిసరిగా పిల్లలను సర్కార్ బడికి పంపించాలని కోరారు.
దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పంపిస్తామని చెప్పడంతో గ్రామపంచాయతీ సిబ్బంది మూసి ఉన్న పాఠశాల ను శుభ్రం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ , సిఅర్ పీలు. కిరణ్ , మంజుల, ప్రియాంక, దాదాపుగా 40 మంది విద్యార్థులు తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.