Education Department | సుల్తానాబాద్ రూరల్ జూన్ 22: గత 10 ఏళ్ల నుంచి మూతపడ్డ సర్కారు బడిని మళ్లీ తెరిపించాలని నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. అధికార యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించింది. మంచరామి గ్రామం వైపు అడుగులు వేసింది. గ్రామంలో పర్యటించి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట ముచ్చట జరిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం సర్కారు బడిని ప్రారంభిస్తే పంపించడానికి సిద్ధమన్నారు. దీంతో అధికారులు బడిని తెరిపించి, ఒక ఉపాధ్యాయుని నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే పెద్దపెల్లి జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ఆదివారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామానికి సుల్తానాబాద్ మండల విద్యాధికారి రాజయ్య వెళ్లారు. గ్రామంలో పర్యటించి, ఇంటిట తిరిగారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపిస్తారా అని తల్లిదండ్రులని అడిగారు. మాకు ప్రైవేటు పాఠశాలకు పంపించడం ఆర్థిక భారం అవుతుందని, మళ్లీ బడి ప్రారంభిస్తే మా పిల్లలను పంపిస్తామని ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. బడిని మళ్లీ ప్రారంభించడంతోపాటు ఒక ఉపాధ్యాయుని కూడా నియమించడం జరుగుతుందని వారికి ఎంఈఓ వివరించారు.
మూతబడ్డ సర్కారు బడిని మళ్లీ ప్రారంభించేందుకు గాను సోమవారం ఉదయం 9.30 గంటలకు బడి ఆవరణలోనే సమావేశం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులకు తెలియజేయాలని గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ ను కోరగా ఆయన స్పందిస్తూ జిపి సిబ్బందితో ఈ రోజు సాయంత్రం దండోరా వేయిస్తానని చెప్పారు. ఈ సమావేశానికి గ్రామస్తులు పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడి టీచర్లు, మహిళా సంఘ ప్రతినిధులు, సీఐలు, గ్రామంలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వారికి ఈ సమావేశానికి అందర్నీ ఆహ్వానించాలని సూచించారు. ఎంఈఓ గ్రామంలో పర్యటించి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి మళ్లీ బడిని ప్రారంభిస్తామని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ కు కృతజ్ఞతలు తెలిపారు.