ప్రభుత్వోద్యోగాల భర్తీ కోసం విద్యార్థి, యువజన సంఘాలు పోరుబాట పట్టాయి. ‘నిరుద్యోగుల మార్చ్’, టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమయ్యాయి. దీంతో నాయకులు హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్‌లు చేయగా, ఇవి అక్రమ అరెస్ట్‌లంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఖండించారు. దొంగరాత్రి ఇండ్లలోకి వచ్చి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఉద్యోగాల పేరిట కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్ట్‌లు మాని, జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటు జిల్లాల్లోనూ నిరసనలు తెలిపారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
కరీంనగర్ కార్పొరేషన్/ వీణవంక/ ఇల్లందకుంట, జూలై 5 : నిరుదోగ్య మార్చ్‌లో భాగంగా టీజీపీఎస్సీ ముట్టడిలో పాల్గొనేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విద్యార్థి, యుజన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కరీంనగర్లో వివిధ విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ శ్రేణలను శుక్రవారం ఉదయం నుంచే పోలీసులు అరెస్టు చేసి సేష్టన్‌కు తరలించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ తిరుపతి నాయక్, బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి వీణవంక, ఇల్లందకుంట నుంచి బయలుదేరిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సబ్బిని హరీశ్‌తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్‌కాలనీ నుంచి విద్యార్థి, యువజన నాయకులను గోదావరిఖని టూ టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ట్ చేశారు. అర్ధరాత్రి విద్యార్థి నాయకుల ఇళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. పెద్దపల్లి నుంచి వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులను, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. కథలాపూర్ మండలంలోని నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషను పోలీసులు హౌస్అరెస్ట్ చేశారు. దీంతో ఆమె జిల్లాకేంద్రం శాంతినగర్‌లోని తన నివాసంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అసలు జాబ్ క్యాలెండర్ వేయడం లేదని మండిపడ్డారు. మోసపూరిత మాటలను నమ్మి ఏ యువకుడైతే కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించుకున్నాడో ఇప్పుడు ఆ యువకుడే ఆగ్రహానికి గురవుతున్నాడని, వారు మర్లబడితే కుర్చీని వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.