కరీంనగర్ రాంనగర్, జనవరి 13 : కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. సంక్రాంతి పండుగపూట నిర్బంధం కొనసాగిస్తున్నది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో సోమవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. కరీంనగర్ రాకుండా ఉండేందుకు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వన్‌టౌన్ వద్దకు పెద్దసంఖ్యలో వచ్చిన నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పీటీసీకి తరలించారు. రాత్రి 10.30 గంటల తర్వాత పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల గ్రంథాలయాల సంస్థ మాజీ అధ్యక్షులు ఏనుగు రవీందర్‌రెడ్డి, రఘువీర్‌సింగ్‌తోపాటు పెద్దసంఖ్యలో నాయకులను అరెస్ట్ చేశారు.
హుజూరాబాద్‌లో తాళ్లపల్లి శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, ఎండీ అమ్జద్‌ను వారి ఇండ్లకు వెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. జగిత్యాల జిల్లాలో నాయకులు దావ సురేశ్, శీలం ప్రవీణ్, నాయకులు వొల్లెం మల్లేశం, రాజును అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఇతర నాయకులను బోయినపల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ వెళ్లవద్దంటూ పోలీసులు నిర్బంధం విధించడంపై ఆగయ్య అసహనం వ్యక్తం చేశారు. పండుగ పూట నిర్బంధం కొనసాగించడంపై నాయకులు మండిపడుతున్నారు. సెలవు రోజుల్లో అరెస్టులు చేయడం ఏంటని? ఇండ్ల నుంచి తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, భయబ్రాంతులకు గురి చేసేందుకే పండుగ పూట కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.