Government schools | పెద్దపల్లి కమాన్, జూన్ 24 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతున్నది. ఈ నెల 6 నుంచి 19 వరకు జిల్లా లో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఒక్కో పాఠశాలలో కొత్తగా కనీసం పది మంది విద్యార్థులు చేరకపోవడం విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల పనితీరు నిదర్శనం గా నిలుస్తుంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంలో ప్రభుత్వ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ మరింతగా పడిపోయింది.
గత రెండేళ్లలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల అసమర్ధ పనితీరుతో దాదాపు పది వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్లిపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 535 ప్రభుత్వ పాఠశాలలో కేవలం నాలుగు వేలమంది విద్యార్థులు చేరడం గమనార్హం.. ఈ లెక్కన సగటున ఒక్కో పాఠశాలలో కొత్త గా కనీసం పది మంది కూడా చేరలేదని తెలుస్తుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడం తో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగగా, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ బడుల అభివృద్ధి పై శ్రద్ద పెట్టకపోవడం, విద్యాశాఖ కు మంత్రి లేకపోవడంతో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయల పనితీరు పై పర్యవేక్షణ కొరవడంతో ప్రభుత్వ విద్య నిర్వీర్యమవుతుందని విద్యావంతులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం బడ్జెట్ లో పాఠశాల విద్య శాఖకు వేల కోట్లు కేటాస్తున్నామని, సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, విద్యార్థులకు అన్ని కల్పిస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రగల్బాలు పలకడమే తప్ప ఆశించిన స్థాయిలో పనితీరు కనిపించడం లేదనే విమర్శలొస్తున్నాయి.
ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రారంభమైన నాటి నుంచి క్రమంగా సర్కార్ విద్య పై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో నమ్మకం సన్నగిల్లిందని అర్థమవుతుంది.. కాగా ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య పడిపోవడం పై వివరణ కోసం డీఈ ఓ మాధవి ని ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ లో సంప్రదించగా, ఆమె స్పందించలేదు.
ఏటేటా తగ్గుతున్న విద్యార్థులు
జిల్లా లోని ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం లో 36,869 మంది విద్యార్థులు ఉండగా, 2024- 25 విద్యా సంవత్సరం లో 31,066 మందికి ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. అంటే 5,803 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వేరే స్కూళ్లకు వెళ్లారు. ప్రస్తుత (2025-26) విద్యా సంవత్సరం లో 27,810 మంది విద్యార్థులు ఉండగా, గతేడాది తో పోల్చితే ఈ విద్యా సంవత్సరం 3,256 మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు గుడ్ బాయ్ చెప్పి వెళ్లిపోయారు. గత రెండేళ్లలో దాదాపు పది వేల మంది విద్యార్థుల సంఖ్య పడిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఇలానే కొనసాగితే మరో మూడేళ్ళలో ప్రభుత్వ బడులన్నీ మూతపడే ప్రమాదమున్నదని విద్యా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.