
Putta Madhukar | ఫెర్టిలైజర్ సిటీ : మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పడు ఈ సమాజాన్ని అణిచివేస్తూ తొక్కిపెడుతూ ఎవరు మాట్లాడితే వాళ్లను జైలుపాలు చేస్తూ రాజ్యమేలుతున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకుడు, కమాన్‌పూర్ మార్కెట్ కమటి మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్‌ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్ట్ చేయడంతో రామగుండం సీపీ కార్యాలయం చేరుకొని ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్లు ప్రశాంతంగా ఉన్న మంథనిని అల్లకల్లోలం చేస్తున్నారని, ప్రతీ రోజు ఏదో ఒక విధ్వంసంతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో బండి రాజు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో అక్రమంగా పూదరి సత్యనారాయణగౌడ్‌ను అరెస్ట్ చేశారని, పూదరి అరెస్ట్ చెల్లదని ఇప్పటికే ఒకసారి జడ్జి చెప్పారని, ఈసారి కూడా జడ్జి పూదరి అరెస్ట్ చెల్లదని వెనక్కి పంపించారని, రామగుండం పోలీసులకు ఖాకీ దుస్తులు వేసుకునే నైతిక హక్కు లేదని, ఇప్పుడు పోలీసులు తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.
ఈనాడు మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్ రాజ్యంగం, పోలీసుల రాజ్యం నడస్తుందని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తలేదన్నారు. రాజ్యాంగం బుక్కు పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ మంథనికి వచ్చి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్టుకునే కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండని, మంథనిలో రాజ్యాంగాన్ని వంచించి అవమానపర్చి చేతులో పట్టకున్నందుకు సిగ్గు పడాలన్నారు. గతంలో దుద్దిళ్ల శ్రీధర్, ఆయన జోకర్ తమ్ముడు కలిసి తనపై రౌడీషీట్ పెట్టించాడని, అయినా తాము వాళ్లను, వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తిన పోలీసులను వదిలిపెట్టామని అన్నారు. కానీ పూదరి సత్యనారాయణను రాత్రి రెండు గంటలకు పట్టుకు వచ్చిన దుద్దిళ్ల శ్రీధర్, ఆయన తమ్ముడు హైదరాబాద్‌లో ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని, వాళ్లకు వత్తాసు పలుకుతున్న పోలీసులను వదిలిపెట్టమని హెచ్చరించారు. దుద్దిళ్ల రాజ్యాంగం ఎక్కువ రోజులు నడువదని, ఇంకా రెండున్నర ఏండ్లు మాత్రమేనని, ఆ తర్వాత ఇదే రోడ్డు మీద మీ భార్య, తల్లి కూడా ఇక్కడ ఏడ్చే రోజులను తీసుకువస్తమని హెచ్చరించారు. గౌడ్స్, కాపు వర్గాల్లో మా వాళ్లలో వాళ్లకే తగువులాటలు పెట్టించి హైదరాబాద్‌లో దుద్దిళ్ల శ్రీధర్ మంట కాగుతున్నాడని ఆరోపించారు.
రామగుండం పోలీసులను ఇప్పటికే హెచ్చరించినా మార్పు రావడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే జైలుభరో కార్యక్రమం పెడుతామని చెప్పామని, జైలుభరో పెడితే మమ్మల్ని జైల్లో పెట్టడానికి మీ జైల్లు సరిపోవని ఆయన అన్నారు. ఐపీఎస్ అధికారి అంటే రాజ్యాంగాన్ని రక్షించే విధంగా పని చేయాలని, కానీ ఇక్కడ ఐపీఎస్ అధికారి ఉన్నా రాజ్యాంగం అవమానపడుతుందంటే మీ యూనీఫాంకే అవమానం అని గమనించాలని, పూదరి సత్యనారాయణ అరెస్ట్ చెల్లదరి రెండోసారి కోర్టు జడ్జి వెనక్కి పంపించారని ఆయన గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకున్న బండి రాజు తమ్ముడు ఇచ్చిన స్టేట్ మెంట్, బాధిత కుటుంబానికి రూ.25లక్షలు ఇస్తమని రాజు మృతికి కారకుడైన వ్యక్తి బాండ్ పేపర్ రాసి ఇచ్చారని ఆయన వివరించారు.
అయితే రాజు ఆత్మహత్యకు కాంగ్రెస్ పార్టీ నాయకుడే కారకుడు కావడంతో బాధిత కుటుంబానికి ఇచ్చే రూ.25లక్షలు ఇవ్వకుండా మోసం చేయడానికి, సదరు వ్యక్తిని కాపాడటానికి, దుద్దిళ్ల శ్రీధర్ కు వత్తాసు పలుకడానికి రాత్రికి రాత్రే పూదరి సత్యనారాయణను అరెస్ట్ చేశారని, ఏ-1ను వదిలిపెట్టి పూదరి సత్యనారాయణను అరెస్ట్ చేయడం ఇంత దౌర్భాగ్యమా అని ప్రశ్నించారు. ఆనాడు ఇక్కడ పని చేసిన ఎస్ఐలు, సీఐలను జైలుకు పంపడానికి దుద్దిళ్ల శ్రీధర్ కుట్రలు చేస్తే తాను కాపాడినా వాళ్లకు ఆ విశ్వాసం కూడా లేకుండా పోయిందని వాపోయారు. ఈ విషయంలో మంథని సీఐ రాజు, ఏసీపీ రమేష్‌ను మిమ్మల్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
మరో రెండున్నర ఏండ్లలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, పదేండ్లు తాము అధికారంలో ఉన్నప్పడు పోలీసులతో కలిసి గొప్పగా సేవలు అందించామని ఓపిక పడుతుంటే అరాచకాలు చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆనాడు ఇక్కడ పని చేసిన పోలీసులు నిష్పక్షపాతంగా పని చేశారని, గంజాయి కుట్రకు ఇక్కడ సీపీగా ఉన్న దుగ్గల్ సహకరించడని దుద్దిళ్ల శ్రీధర్ హైదరాబాద్ పోలీసుల ఆశ్రయించిన విషయం గుర్తించాలన్నారు. దుద్దిళ్ల శ్రీధర్ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు పోలీసులను వాడుకుంటరని, రామగుండం సీపీ పరిధిలో పని చేసే వాళ్లతో అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు.
ఇప్పటికే కాటారం, భూపాలపల్లి జిల్లా, రామగుండం సీపీ పరిధిలోని పోలీసులు తమ కార్యకర్తలను కేసులతో అణిచివేయలేరని, దుద్దిళ్ల శ్రీధరో తామో తేల్చుకుటామన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా తనను తన భార్యను అంతం చేసే దాకా పోరాటం చేస్తూనే ఉంటమన్నారు. ఇప్పటికైనా పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, రాజ్యాంగాన్ని అనుసరించి పని చేయాలని, ఖాకీ యూనీఫాం రక్షిస్తూ ప్రజలకు ఒక నమ్మకం కల్గించి గౌరవించేలా పని చేయాలని ఆయన హితవు పలికారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే శంకరిగిరి మాన్యాలే…మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులకు శంకరగిరి మాన్యాలు తప్పవని, జీవితంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మదూకర్, నాయకులను,కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజలు కన్నెర్ర జేస్తారని ఆయన అన్నారు. రామగుండం సీపీ పరిదిలోని సీఐలు, ఎస్సైలు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పని చేస్తున్నట్లు అర్థం అవుతోందని అన్నారు. ఆనాడు పూదరి సత్యనారాయణగౌడ్ పై పెట్టిన కేసును జడ్జి రిజెక్ట్ చేశారంటే పోలీసులు అవమానపడాలని ఆయన అన్నారు. శ్రీధర్‌బాబు, మక్కాన్ సింగ్ చెప్పారని పని చేస్తే రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పని చేయాల్సి ఉంటుందని గమనించాన్నారు. రామగుండం సీపీ పరిధిలోని పోలీస్స్టేషన్లకు కాంగ్రెస్ కార్యాలయలని బోర్డులు పెట్టే పరిస్థితి తీసుకురావద్దని, ఇక్కడి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా సీపీ ఆదేశాలు జారీ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.