కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 4: 2008 డీఎస్సీ మెరిట్ జాబితా తప్పులతడకగా ఉన్నదని, లిస్టులో ఉన్నవారికి కాదని ఇతరులకు ఉద్యోగాలిస్తున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో ఉద్యోగాలు రానివారికి తిరిగి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు అందించిన విషయం తెలిసిందే. కాగా, కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి తీరుతో తాము నష్టపోతున్నామని 13 మంది అభ్యర్థులు శుక్రవారం రాత్రి డీఈవో కార్యాలయంలో ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2008 డీఎస్సీ ద్వారా ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాలివ్వాల్సిన డీఈవో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ డీఈవో వెబ్సైట్లో మొదట మెరిట్ జాబితాను ఉంచి, ఆ తర్వాత మరో జాబితాను పెట్టి తమకు నష్టం చేశారన్నారు. 16 మంది కొత్త అభ్యర్థులను లిస్ట్‌లో పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అదీ కాకుండా, శుక్రవారం సాయంత్రం మరో 14 మందితో కొత్త లిస్ట్ పెట్టి, తమకు ఉద్దేశ పూర్వకంగానే అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు మాట్లాడుతూ, 2008 డీఎస్సీ అభ్యర్థుల్లో మెరిట్ జాబితా ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు. గతంలో మెరిట్ జాబితాలో ఉండి కూడా కొందరు అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు దూరమయ్యారని, అలాంటి అభ్యర్థులను గుర్తించి, ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.