ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 9 : బీఆర్ఎస్ పాలనలో నిరందీగా సాగు చేసిన రైతన్న, కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నాడు. పంటలు సాగు చేసేందుకు అరిగోస పడుతున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా, రాజన్నపేటలో సాగునీటి కష్టాలు మొదలు కాగా, పంటలను కాపాడుకునేందుకు రైతులు తండ్లాడుతున్నారు. అయినా ఫలితం లేక కండ్లముందే పంటలు చూడలేక విలవిలలాడుతున్నారు. చివరకు చేసేదేమీ లేక పొలాల్లో మూగజీవాలను వదులుతున్నారు. మేకలను వదులుతున్నారు. మల్కపేట రిజర్వాయర్ నీటిని కాలువ ద్వారా నాలుగైదు రోజుల వరకైనా చెరువులు నింపితే పంటలు దక్కుతాయని చెబుతున్నారు. అయినా పట్టించుకునేవారు లేక సర్కారు తీరుపై మండిపడుతున్నారు.
మేకలను మేపుతున్నం
మేం నాలుగెకరాల్లో పొలం ఏసినం. మంచిగ పంట పండుతుందనుకుంటే మొత్తం ఎండిపోతున్నది. చూడలేక పొలంల మేకలనిడిసిపెట్టినం. రెండెకరాల దాక ఎండిపోయెటట్టుంది. ఇప్పటికైనా నీళ్లిడిస్తే ఉన్న పంటనన్న పండుతది. అసలు ఇంతగనం ఇబ్బంది నేను ఎప్పుడూ సూడలే. కరెంటు గూడ సక్కగ ఉంటలేదు. నీళ్లు లెవ్వు. అసలు ఈ సర్కారోళ్లు రైతుల గురించి ఏంజేస్తుర్రో అర్థమైతలేదు. ఎట్లనన్న జేసి మా మైశమ్మ సెరువును నింపాలె. అట్లయితెనే రైతులకు ఏమన్న మేలైతది.
– దరావత్ రజిత, రైతు (చింతగుట్ట తండా)
నీళ్లిడిసి కాపాడాలె
నాకు ఎనిమిదెకరాల భూమి ఉంది. అంతా వరి ఏసిన. కొన్ని రోజుల కింద బోర్లు ఎత్తేసినయ్. సెర్లళ్ల నీళ్లు లేక బోర్లకు నీళ్లు అస్తలెవ్వు. పదేండ్ల పొద్దు కేసీఆర్ ఉన్నన్ని రోజులు నీళ్లకు, కరెంటుకు కష్టం లేకుండ ఉన్నం. ఇప్పుడు మళ్లీ కరెంటు, నీళ్ల కష్టం చూస్తున్నం. పెట్టుబడికి, బోర్లను రిపేర్ చేయించెతందుకు 4 లక్షలు అయినయ్. ఈ పైసలు వడ్డీతో కలుపుకుంటే నాలుగేండ్ల పంట వస్తె కూడా సరిపోదు. పొలంకాడికి పోతే మనసున పడ్తలేదు. మా పెద్ద మనుషులు ఆది శీనన్న దగ్గరికి పోయిన్రు. మల్కపేట నుంచి కాల్వలకు నీళ్లు ఇడువాలని అడిగిన్రని చెప్పిన్రు. శీనన్నగూడ అధికారులతో మాట్లాడిండట. దయచేసి ఎట్లనన్న జేసి నాలుగైదు రోజుల్లో మా సెర్లళ్లకు, కాల్వలకు నీళ్లిడిసి మా రైతులను కాపాడాలె.
– కట్లె పర్శయ్య, రైతు (రాజన్నపేట)