Veenavanka | వీణవంక, జూన్ 23 : యువత మాదకద్రవ్యాలకు బానిసలైతే బతుకు ఛిద్రమవుతుందని, వాటికి దూరంగా ఉండాలని జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాలలో భాగంగా పోలీసులు, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ మాట్లాడుతూ ఉజ్వలమైన భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన యువత చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలకు అంధకారం చేసుకుంటున్నారని అన్నారు.
సెల్‌ఫోన్, టీవీ, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొన్న ప్రెస్, యువతను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం విన్నర్, రన్నర్ టీంలకు ట్రోఫీలు అందజేసి, యువకులకు షటిల్, క్రికెట్ బ్యాట్లు, వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.