కోల్ సిటీ, సెప్టెంబర్ 6: ‘అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని’ అంటే ఇదే కాబోలు.. తలాపున గోదావరి నిండుకుండలా ప్రవహిస్తున్నా.. ఇక్కడి ప్రజలకు మాత్రం తాగునీటి తిప్పలు తప్పడం లేదు. అది కూడా పండగ పూట.. రెండు రోజులుగా తాగునీటి సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు. రామగుండం (Ramagundam) నగరపాలక సంస్థ పరిధిలోని రమేష్ నగర్ ఏరియాలో సాంకేతిక లోపం తలెత్తడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయినట్లు అక్కడి లైన్ మెన్ పేర్కొంటున్నారు. చిన్న వాల్వు చెడిపోయి రెండు రోజులు కావస్తున్న మరమ్మత్తుల విషయంలో నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఏరియా పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు తాగునీటికి అరిగోస పడుతున్నారు.
ఇదే ఏరియాలో ప్రతిసారి తరచుగా సాంకేతిక లోపాలు తలెత్తడం తాగునీటి సరఫరా నిలిచిపోవడం పరిపాటిగా మారింది అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నేటి సరఫరా నిలిచిపోయి పండగ పూట ప్రజలు దూపకు అల్లాడుతుంటే కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. రామగుండం ఎమ్మెల్యే జోక్యం చేసుకొని వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించే విధంగా చర్యల కు ఆదేశించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.