గంగాధర, మార్చ్12: గంగాధర మండల కేంద్రంలో రైతులు సమావేశాల కోసం నిర్మించిన రైతు వేదిక (Rythu Vedika)మందుబాబులకు అడ్డాగా మారింది. సాయంత్రం అయిందంటే చాలు మందుబాబులు మద్యం సీసాలతో రైతుక వేదిక వద్ద హల్చల్ చేస్తున్నారు. మద్యం మత్తులో సీసాలను పగలగొట్టి రైతు వేదికలో పారవేస్తున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం దృష్ట్యా రైతు వేదికలను నిర్మించింది.
రైతులు ఎలాంటి సమస్యలు ఉన్నా ఇందులో కూర్చొని చర్చించుకునేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. అయితే మండలంలో పర్యవేక్షణ లోపం వల్ల ఆకతాయిలకు అడ్డాగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం రైతు వేదికకు వచ్చే రైతులకు పగిలిన గాజు ముక్కలు గుచ్చి గాయాలయ్యే ప్రమాదం ఉంది. గంగాధర రైతు వేదిక స్థానిక పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉందని, అధికారులు స్పందించి మందుబాబులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.