ముకరంపుర, జూలై 3: కరీంనగర్ శివార్లలోని చింతకుంట(గాంధీ నగర్) సమీపంలోని బృందావన్ కాలనీలో నిమిషం పాటు నిలువలేని పరిస్థితి (Drainage) నెలకొంది. ఇళ్ల నుంచి వెలువడే మురుగు ప్రవాహాన్ని ఎల్లమ్మ గుడి సమీపం నుంచి చెరువు వైపునకు మళ్ళించేందుకు కొద్ది నెలల క్రితం ప్రత్యేకంగా పైప్ లైన్ నిర్మించారు. లెవల్ సరిగా లేకపోవడం, పైప్ లైన్లు ఎక్కడికక్కడ కుంగిపోయాయి. దీంతో మురుగు ప్రవాహం ముందుకు వెళ్లలేని దుస్థితి నెలకొంది.
వర్షం వస్తే చాలు మురుగు నీరు తిరిగి ఇళ్ళలోకి చేరుతున్నది. భరించలేని దుర్వాసనకు తోడు పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారి ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈగలు, దోమల వ్యాప్తి అధికమైంది. పలువురు జ్వరంతో బాధపడుతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు స్పందించి మురుగు ప్రవాహం ముందుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.