తిమ్మాపూర్, ఆగస్టు26: పాలకులు లేకపోవడంతో గ్రామాల్లో కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఓ ప్లాట్ యాజమాని ఏకంగా మోరీనే కబ్జా చేయడంతో ఆ వాడకట్టు ప్రజలంతా మురుగు వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని 1వ వార్డులో ఓ ప్లాట్ యాజమాని డ్రైనేజీలోకి మురికినీరు వెళ్లే కాలువను కబ్జా చేసి.. పూర్తిగా మట్టితో నింపాడు.
దాంతో.. చుట్టుపక్కల ఇళ్లలోంచి వచ్చిన మురుగు నీరు ఎక్కడి నీరక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా ఆ వాడ అంతా కంపుకొట్టడమే కాకుండా దోమలు విజృంభిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కాలనీవాసులమంతా తరచూ అనారోగ్యం పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదనీ, ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని వార్డులోని వారంతా కోరుతున్నారు.